జిల్లాలో కిచెన్ మేనేజర్లుగా Self Help Group మహిళల ఆధ్వర్యంలో వినూత్నంగా అమలవుతున్న స్మార్ట్ కిచెన్ వ్యవస్థ దేశవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా నిలవడం జిల్లా యంత్రాంగానికి గర్వకారణమని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు, అలాగే మరింత విస్తరణ కోసం చేపట్టిన అదనపు స్మార్ట్ కిచెన్ల నిర్మాణ పురోగతిపై సంబంధిత కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ, స్మార్ట్ కిచెన్ నిర్వహణ బాధ్యతలను కిచెన్ మేనేజర్లుగా మహిళా సంఘాల సభ్యులకు అప్పగించడం ద్వారా మహిళల సమర్థ నిర్వహణతో విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన, పోషకాహారం సకాలంలో అందుతున్నదని తెలిపారు. ఈ విధానం వల్ల మధ్యాహ్న భోజన పథకం అమలులో పారదర్శకత, సమర్థత పెరిగిందని ఆయన కమిటీ సభ్యులకు వివరించారు.

జిల్లాలో ప్రస్తుతం దశలవారీగా స్మార్ట్ కిచెన్ల విస్తరణ వేగంగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. మొదటి దశలో ఏర్పాటు చేసిన కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని, రెండో, మూడో దశల్లోని కేంద్రాలు విస్తరణ దశలో ఉన్నాయని చెప్పారు. నాలుగో దశలో విస్తరిస్తున్న భవనాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు వేగవంతంగా కొనసాగుతోందని ఆయన వివరించారు.

ప్రతి విద్యార్థికి భోజన ప్లేట్‌ను ప్రత్యేకంగా, యూనిక్‌గా సరఫరా చేసే విధంగా వ్యవస్థను రూపకల్పన చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రతి విద్యార్థికి అందుతున్న ఆహారం పరిమాణం, నాణ్యతపై స్పష్టమైన పర్యవేక్షణ సాధ్యమవుతోందని ఆయన పేర్కొన్నారు.

స్మార్ట్ కిచెన్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాల ఏర్పాటు, పరికరాల సరఫరా, నిర్వహణ వంటి అంశాల్లో ఎలాంటి జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. కమిటీ సభ్యులు, సంబంధిత శాఖాధికారులు ఈ దిశగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ సూచించినట్లు సమావేశంలో పాల్గొన్న అధికారులు తెలిపారు.