రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: జిల్లా యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతూ, సరికొత్త ఆలోచనలు, వినూత్న ఆవిష్కరణలకు వేదికగా రూపుదిద్దుకుంటున్న "స్టార్టప్ కడప" ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా జిల్లాలో స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించి, యువతకు కొత్త అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు.
గురువారం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు, సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన గారితో కలిసి "స్టార్టప్ కడప" ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. భవనం నిర్మాణం దాదాపు పూర్తయి, ప్రస్తుతం ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ నిర్మాణ స్థలంలో వివిధ విభాగాలను పరిశీలించి, పనుల నాణ్యత, వేగం గురించి కాంట్రాక్టర్, ఇంజినీరింగ్ విభాగ అధికారులతో చర్చించారు. భవనం రూపకల్పన, అంతర్గత విభజన, భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే సదుపాయాలపై కూడా ఆయన సూచనలు చేశారు.
డా. శ్రీధర్ చెరుకూరి గారు అధికారులకు భవనం బాహ్య నిర్మాణ పనులను వారంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం వెంటనే అంతర్గత సదుపాయాల ఏర్పాటును వేగవంతం చేసి, నిర్ణయించిన గడువులోగా కేంద్రాన్ని వినియోగానికి సిద్ధం చేయాలని సూచించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం జరగాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ కేంద్రం ద్వారా స్టార్టప్ వ్యవస్థాపకులు, ఫ్రీలాన్సర్లు, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలకు అవసరమైన మార్గదర్శకత్వం, ఆధునిక సదుపాయాలు, ప్రోత్సాహం లభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఒకే వేదికపై కార్యాలయ వసతి, సమావేశాల గదులు, శిక్షణా సదుపాయాలు, నిపుణుల సలహా వంటి సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కడపను పారిశ్రామిక అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దడంలో "స్టార్టప్ కడప" ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రతిభను వెలికితీసి, కొత్త వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించడంలో ఈ కేంద్రం దోహదపడుతుందని ఆయన అన్నారు. యువత సృజనాత్మకతకు, ఆవిష్కరణలకు ఈ వేదిక బలమైన ఆధారంగా నిలుస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.













