వైఎస్సార్‌ కడప జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలల తరబడి లభ్యం కాని విటమిన్‌ ఎ ద్రవం మళ్లీ అందుబాటులోకి వచ్చింది. రే చీకటి నివారణతో పాటు ఇతర నేత్ర సమస్యలు రాకుండా చిన్నారులకు అందించే ఈ ద్రవం కొరతతో ఇప్పటివరకు టీకాల కార్యక్రమాల్లో ఇవ్వలేకపోయారు. తాజాగా జిల్లా స్థాయిలో నిల్వలు చేరడంతో వైద్య, ఆరోగ్య శాఖ ఊపిరి పీల్చుకుంది.

జిల్లా వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం కింద చిన్నారులకు నిర్దిష్ట వ్యవధిలో విటమిన్‌ ఎ ద్రవం తాపించాలి. అయితే ఏడాదిన్నర క్రితం సరఫరా చేసిన ద్రవానికి గతేడాది డిసెంబరులో గడువు ముగియడంతో నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. ఆ తర్వాత కొత్తగా తెప్పించాల్సిన బాధ్యత ఉన్న వైద్యాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ద్రవం అందుబాటులో లేకుండా పోయింది.

ప్రతి వారంలో రెండుసార్లు నిర్వహించే వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి పిల్లలను తీసుకువచ్చే తల్లిదండ్రులు విటమిన్‌ ఎ డోసు గురించి అడిగినా, నిల్వలు లేవనే సమాధానమే వస్తోంది. ఈ పరిస్థితి నెలల తరబడి కొనసాగింది. చివరికి సమస్య ప్రభుత్వ పెద్దలు, రాష్ట్ర స్థాయి వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఇటీవల విటమిన్‌ ఎ ద్రవం జిల్లాకు పంపిణీ చేశారు.

జిల్లాకు 100 మిల్లీలీటర్ల సామర్థ్యం గల 2,830 విటమిన్‌ ఎ ద్రావణ సీసాలు చేరాయి. వ్యాధి నిరోధక టీకాల నిల్వ కేంద్రం నుంచి ఇవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రులు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, జిల్లా వైద్యాలయం, రిమ్స్‌ తదితర ప్రభుత్వ వైద్య సంస్థలకు పంపిణీ చేయనున్నారు.

జిల్లాలో 0–6 నెలల వయస్సు గల పిల్లలు 10,534 మంది, ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపు చిన్నారులు 61,604 మంది, మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపు ప్రీ స్కూల్‌ విద్యార్థులు 42,635 మంది ఉన్నట్లు అధికారిక అంచనాలు సూచిస్తున్నాయి. వీరి కంటి చూపు ఆరోగ్యంగా ఉండేందుకు, రే చీకటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తగా విటమిన్‌ ఎ ద్రవం తాపించడం కీలకమని వైద్యులు చెబుతున్నారు. అయిదు నెలల విరామం తర్వాత మళ్లీ ఈ ద్రవం లభ్యమవుతుండటంతో తల్లిదండ్రులు కొంత ఊరట చెందుతున్నారు.

అని కడప జిల్లా డీఐఓ జె.ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. విటమిన్‌ ఎ ద్రవం మళ్లీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, తల్లిదండ్రులు సమీప ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో టీకాల రోజుల్లో పిల్లలకు తప్పనిసరిగా డోసు వేయించుకోవాలని వైద్య విభాగం సూచిస్తోంది.