రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప: వైఎస్సార్ కడప జిల్లాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశభక్తి స్ఫూర్తి ఉట్టిపడేలా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునుడితో కలిసి ఆయన వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ నెల 15న పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై శాఖల వారీగా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. పటిష్టమైన ప్రణాళికతో ముందస్తు ఏర్పాట్లు చేసి, వేడుకలకు విచ్చేసే ముఖ్య అతిథులు, ప్రజలు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.
పరేడ్ నిడివి, వేదిక నిర్వహణ, ముఖ్య అతిథుల రాకపోకలు, ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండేలా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరేడ్ కార్యక్రమం అంతరాయం లేకుండా, సమయపాలనతో సాగేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
మౌలిక వసతుల పరంగా నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి వసతి, పారిశుధ్య పనులను నిరంతరంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వేడుకల సమయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా తాత్కాలిక మరుగుదొడ్లు, చెత్త సేకరణ, శుభ్రత పనులను సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత శాఖలపై బాధ్యతలు అప్పగించారు.
భద్రత, వైద్య పరంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. అగ్నిమాపక శకటాలు, ప్రత్యేక వైద్య శిబిరాలను వేడుకల ప్రాంగణానికి సమీపంలో అందుబాటులో ఉంచి, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ప్రదర్శనల విషయంలో ప్రభుత్వ ప్రగతిని చాటిచెప్పేలా ఆయా శాఖల ఆధ్వర్యంలో ఆకర్షణీయమైన శకటాలు, ప్రదర్శన స్టాళ్లను సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అవగాహన కలిగించేలా శకటాల రూపకల్పన చేయాలని ఆయన పేర్కొన్నారు.
దేశభక్తిని పెంపొందించేలా విద్యార్థులతో వినూత్న సాంస్కృతిక కార్యక్రమాలను రూపకల్పన చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి శాఖకు కేటాయించిన విధులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, విధుల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందిని గుర్తించి వేడుకల రోజున ప్రశంసా పత్రాలు అందజేస్తామని ఆయన ప్రకటించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆర్డీఓ మురళి, మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, సీపీఓ హేజరత్తయ్య, పీడీ డ్వామా ఆదిశేషారెడ్డి, పీడీ డిఆర్‌డిఎ డాక్టర్ రాజ్యలక్ష్మి, వ్యవసాయ శాఖ జేడీ సుబ్రహ్మణ్యేశ్వర రావు, ఉద్యాన శాఖ అధికారి హరి ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













