రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులకు 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ, పొలాల్లో పాముకాటు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన సదుపాయాలను అన్ని వాహనాల్లోనూ సిద్ధం చేశారు.
ప్రస్తుతం ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురై ప్రాణాపాయ స్థితికి చేరుకునే వారు, అలాగే పొలాల్లో పాముకాటుకు గురయ్యే రైతులు, కూలీలకు తక్షణ ఉపశమనం కల్పించేందుకు అవసరమైన మందుల కిట్లు 108 అంబులెన్స్‌ల్లో అందుబాటులో ఉంచారు. దీంతో వడదెబ్బ, పాముకాటుకు గురైన బాధితులకు ఆసుపత్రికి చేరుకునేలోపే ప్రాథమిక చికిత్స అందించే అవకాశం కలుగుతోంది.
జిల్లాలో మొత్తం 40 108 అంబులెన్స్ వాహనాలు సేవలందిస్తున్నాయి. వీటి ద్వారా రోజుకు సుమారు 150 నుంచి 200 మంది వరకు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు, గుండె జబ్బు బాధితులు, ప్రసవాల కోసం వెళ్లే గర్భిణులు, వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు వైద్యసేవలు పొందుతున్నారు. ఇప్పుడు వీరితో పాటు వడదెబ్బ, పాముకాటు బాధితులకు కూడా 108 సిబ్బంది వైద్యుల సూచనల మేరకు సేవలు అందిస్తున్నారు.
తాజాగా అన్ని అంబులెన్స్‌ల్లో ఐస్‌ప్యాక్‌లు, పాముకాటుకు గురైన వారి ప్రాణాలను నిలిపే యాంటీ స్నేక్ వెనమ్ ఇంజెక్షన్లు సిద్ధంగా ఉంచారు. దీంతో సంఘటన స్థలంలోనే ప్రాథమిక చికిత్స ప్రారంభించే వీలుంటోంది.
పాముకాటు కేసుల్లో 108 వాహనం బాధితుడి వద్దకు చేరుకున్న వెంటనే వీడియో కాల్ ద్వారా విధుల్లో ఉన్న వైద్యులతో సంప్రదిస్తారు. వైద్యుల సూచనలు, సలహాల మేరకు యాంటీ స్నేక్ వెనమ్ ఇంజెక్షన్‌ను సెలైన్ బాటిల్‌లో కలిపి బాధితుడికి ఎక్కిస్తారు. ఈ విధంగా ఆసుపత్రికి తరలించేలోపే చికిత్స ప్రారంభమవడంతో ప్రాణాపాయం తగ్గే అవకాశాలు పెరుగుతున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
వడదెబ్బకు గురైన బాధితుల విషయంలో 108 సిబ్బంది ఈఎంటీ సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు. ఐస్‌ప్యాక్‌లను టవల్‌లో చుట్టి బాధితుడి శరీరంపై ఉంచి శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తారు. అవసరమైతే సెలైన్ ఎక్కించి ద్రవ లోపాన్ని భర్తీ చేస్తారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ప్రభుత్వ ఆసుపత్రికి తక్షణమే తరలించి తదుపరి చికిత్స అందేలా చూస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వడదెబ్బ, పాముకాటు ఘటనలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో 108 అంబులెన్స్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా అందించినట్లు ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సమయానికి స్పందించి, సంఘటన స్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించడం ద్వారా మరిన్ని ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.













