రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు ప్రాంతంలో విద్యుత్ సరఫరా తీవ్రంగా దెబ్బతింటోంది. విద్యుత్ అధికారుల ఇష్టారాజ్యంతో రోజులో కనీసం పదిసార్లు విద్యుత్ కోతలు తప్పనిసరిగా మారాయి. ఎప్పుడెప్పుడు విద్యుత్ పోతుందో, ఎప్పుడెప్పుడు వస్తుందో ప్రజలకు స్పష్టత లేకుండా ఉంది. దీంతో సాధారణ ప్రజలతో పాటు రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గాలి కొంచెం వీచినా, చెట్ల ఆకులు కదిలినా, ఆకాశం కాస్త మబ్బు పట్టినా, ఎండ ఎక్కువైనా, చిన్న చినుకులు పడినా వెంటనే విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాతావరణంలో స్వల్ప మార్పు వచ్చినా విద్యుత్ నిలిపివేయడం రోజువారీ వ్యవహారంగా మారిందని వారు మండిపడుతున్నారు.
నెలవారీ విద్యుత్ బిల్లులు వసూలు చేయడంలో మాత్రం అధికారులు చూపుతున్న ఆసక్తి, విద్యుత్ సరఫరా సక్రమంగా అందించడంలో కనిపించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ డ్యూటీ, ఫిక్స్ డ్, కస్టమర్ చార్జీలు, FPPCA1, FPPCA2, FPPCA3 వంటి ట్యాక్సుల పేరుతో అధిక బిల్లులు వసూలు చేస్తూనే, నిరంతర విద్యుత్ సరఫరా పై మాత్రం అధికారులు చొరవ చూపడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
అక్రమ విద్యుత్ వినియోగంపై దాడులు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని, నియంత్రణ పేరుతో సాధారణ వినియోగదారులపై విద్యుత్ కోతల రూపంలో భారాన్ని మోపడం సిగ్గుచేటు చర్యగా స్థానికులు అభివర్ణిస్తున్నారు. అక్రమ వినియోగాన్ని అరికట్టాల్సిన చోట, ముందస్తు సమాచారం లేకుండా అనేకసార్లు విద్యుత్ సరఫరా నిలిపివేయడం సరైన పద్ధతి కాదని వారు అంటున్నారు.
ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడంతోనే విద్యుత్ అధికారులు ఇష్టానురీతిన వ్యవహరిస్తున్నారన్న విమర్శలు మైదుకూరులో వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం కోసం ఒత్తిడి చేయాల్సిన ప్రజాప్రతినిధులు మౌనంగా ఉండటంతో పరిస్థితి మరింత దిగజారిందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.
అప్రకటిత విద్యుత్ కోతలను నిలువరించేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలని మైదుకూరు ప్రాంత ప్రజలు, రైతులు, వ్యాపారులు కోరుతున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం మాత్రమే విద్యుత్ కోతలు అమలు చేయాలని, అక్రమ విద్యుత్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని, సాధారణ వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.













