రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దటూరు:- నాణ్యమైన డీజిల్, పెట్రోల్ వాడకపోతే వాహనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంధనంలో కల్తీ ఉందని అనుమానం వచ్చినప్పుడు సంబంధిత బంకు నిర్వాహకులపై చర్యలు తీసుకునేలా పౌరసరఫరాలు, తూనికలు, కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సూచిస్తున్నారు. వినియోగదారులు కూడా కొన్ని సులభ పరీక్షల ద్వారా ఇంధన నాణ్యతను స్వయంగా పరిశీలించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
పెట్రోల్ స్వచ్ఛతను తెలుసుకోవడానికి ఫిల్టర్ పేపర్ లేదా తెల్లని కాగితం ఉపయోగించవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. తెల్ల కాగితంపై ఒకటి, రెండు చుక్కలు పెట్రోల్ వేయాలి. అసలైన పెట్రోల్ అయితే ఎలాంటి మరకలు లేకుండా పూర్తిగా ఆరిపోతుందని, కల్తీ పెట్రోల్ అయితే కాగితంపై నల్లటి లేదా జిడ్డు మరకలు మిగిలిపోతాయని వారు సూచిస్తున్నారు. ఈ విధానం ద్వారా సాధారణ వినియోగదారుడు కూడా ప్రాథమికంగా పెట్రోల్ నాణ్యతను అంచనా వేసుకోవచ్చని పేర్కొంటున్నారు.
ఇంధన బంకుల్లో పెట్రోలు సాంద్రతను కొలిచే హైడ్రో మీటరు అనే పరికరం తప్పనిసరిగా ఉండాలని నియమాలు చెబుతున్నాయి. ఈ పరికరం సాధారణంగా బంకు వద్ద తెరపై కనిపించేలా ఉంచుతారు. నిపుణుల వివరాల ప్రకారం పెట్రోల్ డెన్సిటీ సాధారణంగా 710 నుండి 770 మధ్య, డీజిల్ డెన్సిటీ 810 నుండి 870 మధ్య ఉండాలి. తెరపై కనిపించే అంకెలపై వినియోగదారులకు అనుమానం కలిగితే, హైడ్రో మీటరు ద్వారా పరీక్షించి చూపాలని బంకు సిబ్బందిని కోరే హక్కు వారికి ఉంది.
కొలతల్లో మోసపోకుండా ఉండేందుకు వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ పోయించుకునే ముందు పంపు తెరపై జీరో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలి. ఇంధనం వాహనంలో నింపుతున్న సమయంలో పైపుకు ఉన్న సిస్టమ్‌ను మాటిమాటికి నొక్కినా, పెట్రోల్ ట్యాంకుల్లో పడకపోయినా తెరపై నంబర్లు మారుతున్నాయా లేదా అన్నది గమనించాలి. ఈ విధంగా కొలతల్లో తేడా ఉంటే వెంటనే గుర్తించవచ్చని అధికారులు చెబుతున్నారు.
అలాగే పెట్రోల్ బంకుల్లో వాహన టైర్లలో గాలిని నింపుకునే సదుపాయం కల్పించడం యజమానుల బాధ్యతగా నిబంధనలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. వినియోగదారులు ఇంధన నాణ్యత, కొలతల ఖచ్చితత్వం, గాలి నింపే సదుపాయం వంటి అంశాలపై అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా లోపాలు గమనించినప్పుడు సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేయాలని నిపుణులు, అధికారులు సూచిస్తున్నారు.













