రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించనున్న ఉచిత మెగా మెడికల్ క్యాంపును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ఎన్జీవోస్ వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షులు బలపనూరు శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఉద్యోగులు, పెన్షనర్లు, సాధారణ ప్రజలందరికీ ఈ వైద్య శిబిరం ఉపయోగకరంగా ఉండనుందని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం ఆగస్టు 9న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రొద్దుటూరులోని ఎన్జీవో హోంలో ఈ మెగా మెడికల్ క్యాంపును నిర్వహించనున్నట్లు శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ప్రొద్దుటూరు ఎన్జీవో హోంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

ఈ వైద్య శిబిరంలో గుండె సంబంధిత, ఆర్థోపెడిక్, కంటి మరియు జనరల్ మెడిసిన్ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు ఉచితంగా సేవలు అందించనున్నారు. క్యాంపుకు వచ్చే ప్రతి ఒక్కరికీ అవసరమైన పరీక్షలు, వైద్య సలహాలు, సూచనలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన వివరించారు.
క్యాంపులో ఉచితంగా నిర్వహించనున్న పరీక్షలు, సేవల వివరాలను ఆయన వెల్లడించారు. గుండె సంబంధిత సమస్యల కోసం ECG, 2D Echo పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే షుగర్, రక్తపోటు (BP) పరీక్షలు కూడా ఉచితంగా చేయనున్నారు. హోలిస్టిక్ వైద్య నిపుణులచే ప్రత్యేక వైద్య సేవలు అందించడంతో పాటు, అవసరమైన రోగులకు ఉచితంగా మందుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఈ మెగా మెడికల్ క్యాంపుకు ముఖ్య అతిథిగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హాజరుకానున్నారు. వైద్యుల సూచనలు, సలహాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని శ్రీనివాసులు సూచించారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
విలేకరుల సమావేశంలో జిల్లా కోశాధికారి టీ. శ్రీనివాసులు, సంయుక్త కార్యదర్శి డీ. పద్మనాభరావు, ప్రొద్దుటూరు తాలూకా అధ్యక్షులు రామసుబ్బయ్య, కార్యదర్శి ప్రమీల, కోశాధికారి సదాశివయ్య, ఉపాధ్యక్షులు నాగార్జున, వరప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శి ప్రభంజన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి నారాయణరాజు, మహిళా విభాగం సభ్యురాలు గంగాదేవి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వీరయ్య, కార్యదర్శి ఓంకార్, మహేశ్వరయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు.













