ప్రొద్దుటూరు పట్టణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సోమవారం చేసే పర్యటనను దృష్టిలో పెట్టుకుని పారిశుధ్య ఏర్పాట్లను విస్తృతంగా చేపట్టినట్లు మున్సిపల్ కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక సూచనల మేరకు పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఎప్పుడూ చేయని విధంగా ప్రయోగాత్మకంగా ఈసారి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ‘లైవ్ శానిటేషన్’ వ్యవస్థను అమలు చేయనున్నట్లు కమీషనర్ వివరించారు. సభా ప్రాంగణం, వివిఐపి ప్రాంతాలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో ఎక్కడైనా చెత్త కనిపించిన వెంటనే విధుల్లో సిద్ధంగా ఉన్న శానిటేషన్ కార్మికులు తక్షణమే స్పందించి ఆ చెత్తను తొలగించే విధానాన్నే ‘లైవ్ శానిటేషన్’గా నిర్వచిస్తున్నట్లు ఆయన తెలిపారు.

‘లైవ్ శానిటేషన్’ అంటే సభా ప్రాంగణం, వివిఐపి ఏరియా, తదితర ముఖ్యమైన ప్రాంతాలలో చెత్త కనబడితే విధులలో సిద్ధంగా ఉన్న శానిటేషన్ కార్మికులు గరుడ వేగంగా ఆ ప్రాంతం నుంచి చెత్తను తొలగించడం జరుగుతుంది

ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 200 మంది శానిటేషన్ కార్మికులను, 50 మంది సిబ్బందిని సిద్ధం చేసినట్లు తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో శానిటేషన్ సెక్రెటరీస్‌తో సమీక్షా సమావేశం నిర్వహించి, లైవ్ శానిటేషన్ అమలు విధానంపై వారికి దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరికీ బాధ్యతలు స్పష్టంగా కేటాయించినట్లు ఆయన వివరించారు.

సీఎం పర్యటనను పురస్కరించుకుని ప్రొద్దుటూరు పట్టణం మొత్తం శానిటేషన్ పనులు జరుగుతున్నాయని కమీషనర్ తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో, ప్రధాన రహదారులు, కాలనీలు, మార్కెట్ ప్రాంతాల్లో చెత్త తొలగింపు, రోడ్ల శుభ్రపరిచే పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.

మొత్తం మీద సుమారు 750 మంది కార్మికులు పారిశుధ్య సమర్థ నిర్వహణ కోసం సిద్ధంగా ఉన్నారని తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సమయంలో పట్టణం మొత్తం పరిశుభ్రంగా ఉండేలా మున్సిపాలిటీ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.