రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు చెందిన ఉన్నత విద్యార్థుల కోసం మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
‘కాఫీ విత్ కమిషనర్’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ముఖాముఖి కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మున్సిపల్ కమిషనర్ ఛాంబర్‌లో జరుగుతుంది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు చెందిన డిగ్రీ మరియు ఆపై ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
విద్యార్థుల ఆశయాలు, ప్రతిభ, కెరీర్ లక్ష్యాలను తెలుసుకోవడంతో పాటు, వారి భవిష్యత్తు దిశగా అవసరమైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఆత్మీయంగా రూపకల్పన చేసినట్లు మున్సిపల్ వర్గాలు తెలిపాయి. పట్టణ పరిశుభ్రత కోసం శ్రమించే పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు చెందిన విద్యార్థులలో ఉన్న సామర్థ్యాన్ని వెలికితీయడం, వారికి అవసరమైన మార్గనిర్దేశం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్నారు.
“పట్టణ పరిశుభ్రత కోసం శ్రమించే చేతులకు గౌరవం. ఆ చేతుల పిల్లల కలలకు కమిషనర్ గారి తోడ్పాటు.”
కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ విద్య, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్తు లక్ష్యాలపై కమిషనర్‌తో నేరుగా మాట్లాడే అవకాశం పొందనున్నారు. వారి సమస్యలు, అవసరాలు, ఎదుర్కొంటున్న సవాళ్లను కమిషనర్ ప్రత్యక్షంగా తెలుసుకుని, సాధ్యమైనంత మేరకు సహాయం, మార్గదర్శకత్వం అందించేందుకు ప్రయత్నించనున్నారని అధికారులు పేర్కొన్నారు.
“కాఫీ విత్ కమిషనర్ అంటే కేవలం ఒక సందేశం కాదు.. పారిశుధ్య కార్మికుల పిల్లల ప్రతిభను ప్రోత్సాహించడం”
గాంధీ జయంతి రోజున ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ద్వారా సేవా భావం, సమానత్వం, సామాజిక న్యాయం పట్ల మున్సిపల్ పరిపాలన కట్టుబాటును ప్రతిబింబించే ప్రయత్నంగా అధికారులు భావిస్తున్నారు. పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, తమ భవిష్యత్తు లక్ష్యాలపై స్పష్టత పొందాలని మున్సిపల్ వర్గాలు సూచిస్తున్నాయి.













