రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగ నిర్మూలన చర్యలపై మున్సిపల్ కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్‌కు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, వైసీపీ నాయకుడు పాతకోట బంగారు మునిరెడ్డి మర్యాదపూర్వకంగా అభినందనలు తెలిపారు. మంగళవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో ఆయన కమీషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమ కార్యకలాపాలపై కమీషనర్ దృష్టి సారించాలని పాతకోట బంగారు మునిరెడ్డి కోరారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మార్కెట్ గేటు వసూలు విషయంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి, సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కమీషనర్‌కు పిర్యాదు చేశారు.
పాతకోట బంగారు మునిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ స్పందించినట్లు సమాచారం. మున్సిపాలిటీ కార్యకలాపాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, ఫిర్యాదులపై తగిన దర్యాప్తు జరిపే దిశగా చర్యలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.
అలాగే ఆగస్టు 15 నుండి ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రారంభించిన స్వచ్ఛ సంకల్ప దీక్ష కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా విజయవంతం చేయాలని కమీషనర్ కోరారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, శుభ్రతను మెరుగుపరచే దిశగా మున్సిపాలిటీ చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రొద్దుటూరు అభివృద్ధి, పారిశుధ్య పరిరక్షణలో ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కూడా చురుకుగా పాల్గొనాలని మున్సిపాలిటీ అధికారులు సూచిస్తున్నారు. పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చే లక్ష్య సాధనకు అన్ని వర్గాల సహకారం అవసరమని వారు భావిస్తున్నారు.
కమీషనర్‌ను కలిసిన వారిలో మాజీ వైస్ చైర్మన్ ఖాజా, మాజీ ఎంపీపీ శేఖర్ యాదవ్, వైసీపీ నాయకుడు గురునాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం, పారిశుధ్య నిర్వహణ, అవినీతి నిర్మూలన వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది.













