ప్రొద్దుటూరు పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారుల నుంచి వెల్ఫేర్ సిబ్బంది అక్రమంగా నగదు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని వాట్సాప్ ద్వారా తెలియజేయడంతో, మున్సిపల్ కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తక్షణమే స్పందించి విచారణ జరిపి, వసూలు చేసిన డబ్బును పేదలకు తిరిగి చెల్లింపజేశారు. ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.

వివరాల్లోకి వెళ్తే, ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా అర్హులైన పేదలకు ప్రభుత్వం ప్రతి నెల పింఛన్ మంజూరు చేస్తోంది. అయితే అర్హత ఉన్నప్పటికీ కొంతమంది లబ్ధిదారులకు నెల నెలా ప్రభుత్వం ఇచ్చే డబ్బు అందడం లేదని ఫిర్యాదులు రావడంతో, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు వెల్ఫేర్ సిబ్బందికి లబ్ధిదారుల వివరాలను ఎన్టీఆర్ భరోసా పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు అర్హులైన పేదల వివరాలు నమోదు చేయాలని సమయం ఇచ్చారు.

ఈ ప్రక్రియను అవకాశంగా చూసుకున్న కొంతమంది అక్రమార్కులు లబ్ధిదారుల నుంచి నగదు వసూలు చేయడం ప్రారంభించినట్టు సమాచారం వచ్చింది. ఈ అక్రమ వసూళ్ల విషయాన్ని ప్రజలు వాట్సాప్ ద్వారా కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ దృష్టికి తీసుకువచ్చారు. అందిన సమాచారంపై ఆయన తనదైన శైలిలో విచారణ ప్రారంభించి, ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

తనిఖీ సందర్భంగా కమీషనర్ లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వివరాలు సేకరించారు. 7వ వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ చెన్న సుదర్శన్ గత రెండు రోజులుగా 10 మంది లబ్ధిదారుల నుంచి ఒక్కొక్కరికి రూ.200 చొప్పున నగదు తీసుకున్నట్టు విచారణలో బయటపడింది. దీనిపై ఆగ్రహించిన కమీషనర్, సంబంధిత లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి, వెల్ఫేర్ అసిస్టెంట్ సుదర్శన్ ద్వారా దగ్గిరుండి డబ్బులు తిరిగి చెల్లింపజేశారు.

సిబ్బంది చేసిన తప్పుకు కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ స్వయంగా లబ్ధిదారులకు క్షమాపణ చెప్పినట్టు సమాచారం. అనంతరం అక్రమంగా నగదు వసూలు చేసిన 7వ వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ సుదర్శన్‌కు వివరణ ఇవ్వాలని తాఖీదు జారీ చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలకు పాల్పడి పేదల నుంచి డబ్బు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సిబ్బందిని ఆయన హెచ్చరించినట్టు తెలిసింది.

కమీషనర్ ఈ చర్యకు ప్రజల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు వరదరాజుల రెడ్డి కార్యాలయం కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ, ప్రభుత్వ పథకాల పేరుతో ఎవరైనా నగదు వసూలు చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించిన విషయం తెలిసిందే.