రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిపోయిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆరోపించారు. పోలీసుల పనితీరు ఏ స్థాయిలో ఉందనేది ప్రస్తుతం రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
శనివారం ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో రాచమల్లు శివప్రసాదరెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఐ నాగరాజు వ్యవహారశైలి కారణంగా క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకోవడం, సాయికృష్ణ లాకప్ దహనం, ఆదోనిలో జరిగిన మహిళ లాకప్ డెత్ వంటి వరుస సంఘటనలు రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలన్నింటిని గమనిస్తే శాంతిభద్రతలు క్షీణించాయని ప్రజలందరూ భావిస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఇంతగా దిగజారడానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెంటనే రాజీనామా చేయాలని రాచమల్లు డిమాండ్ చేశారు. హోంమంత్రి వంగలపూడి అనితకు మాటలు ఎక్కువ, పని తక్కువగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
సాయికృష్ణ మృతదేహం ఇప్పటికీ లభించకపోవడం వల్ల ఆ తల్లికి గర్భశోకం మిగిలిపోయిందని రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. తన కుమారుడు ఏమయ్యాడని సాయికృష్ణ తల్లి గర్భం ప్రశ్నిస్తోందని, ఆమెకు ఏం సమాధానం ఇస్తారని కూటమి ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
సాయికృష్ణ ఘటనకు సంబంధించి సీఐ నాగరాజుతో పాటు బాధ్యులైన ఇతరులపై కూడా సీబీఐ విచారణ జరపాలని రాచమల్లు డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.













