రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్:
ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లకు అర్హులైన వారు గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి
ప్రొద్దుటూరు : ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ పథకానికి అర్హత కలిగిన లబ్ధిదారులు తప్పనిసరిగా దరఖాస్తులు చేసుకోవాలని కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ సూచించారు. నిరుపేదలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన వివరించారు.
ఈ నెల సెప్టెంబర్ 7 నుండి 16 వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు కమీషనర్ తెలిపారు. నిర్ణయించిన గడువులోపు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
అర్హులైన 60 సంవత్సరాలు దాటిన వృద్ధులతో పాటు చేనేత కార్మికులు, వితంతువులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, చర్మకారులు, దివ్యాంగులు, గీత కార్మికులు, మత్స్యకారులు, ట్రాన్సజెండర్స్ తమకు సంబంధించిన అవసరమైన దస్త్రాలతో వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని కమీషనర్ కోరారు.
ఈ సందర్భంగా కమీషనర్ శ్రీనివాస విశ్వనాధ్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అర్హత కలిగిన ఒక్క లబ్ధిదారుడు కూడా పథకం ప్రయోజనాల నుండి నష్టపోకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.













