రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దటూరు : ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, ప్రొద్దటూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద శుక్రవారం పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. మున్సిపల్ కార్మికుల ఉద్యోగ, సేవా నిబందనలు, సంక్షేమం, వేతనాలపై కొనసాగుతున్న సమస్యలకు పరిష్కారం కోరుతూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ధర్నాలో పాల్గొన్న కార్మికులు తమ ప్రధాన డిమాండ్లను స్పష్టంగా వెల్లడించారు. మున్సిపల్ సేవల్లో జరుగుతున్న ప్రైవేటీకరణను పూర్తిగా రద్దు చేయాలని, హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆప్కాస్ కార్మికులందరిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని వారు కోరుతున్నారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆప్కాస్ కార్మికులకు రిటైర్మెంట్ సమయంలో 10 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, నెలకు 10 వేల రూపాయల పింఛన్ మంజూరు చేయాలని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. విధి నిర్వహణలో లేదా ఇతర కారణాలతో మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు, వారికి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెల్లించాలని కూడా వారు కోరుతున్నారు.
12వ పి.ఆర్.సి అమలు చేసి ఆప్కాస్ కార్మికుల జీతాలను పెంచాలని, కోవిడి కార్మికులకు ఎస్ ఎస్ రేట్ల ప్రకారం 18,500 రూపాయలు చెల్లించాలని, వారిని ఆప్కాస్‌లో కలిపి గుర్తించాలని డిమాండ్ చేశారు. గత రెండు సంవత్సరాలుగా కార్మికులకు యూనిఫామ్ ఇవ్వలేదని, వెంటనే యూనిఫామ్‌లు అందించాలని, ప్రతి సంవత్సరం కొబ్బరి నూనె, చెప్పులు సభ్యులకు ఇవ్వాలని వారు కోరుతున్నారు.
కార్మికులు పనికి అవసరమైన పనిముట్లు సరిపడా అందించాలని, తోపుడు బండ్లు, ఇంటింటి చెత్త సేకరణకు అవసరమైన డబ్బాలు, పోరక పుల్లలు వంటి సామగ్రిని వెంటనే తెప్పించాలని యూనియన్ ప్రతినిధులు తెలిపారు. మున్సిపల్ వెహికల్‌లను సమయానికి రిపేర్ చేయించి, సేవలు అంతరాయం లేకుండా చూడాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.
తమ ఈ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున సమ్మెకు దిగాల్సిన పరిస్థితి వస్తుందని యూనియన్ నాయకులు హెచ్చరించారు.
ఈ ధర్నాలో మున్సిపల్ యూనియన్ గౌరవాధ్యక్షులు సత్యనారాయణ, మున్సిపల్ యూనియన్ పట్టణ ప్రధాన కార్యదర్శి సాల్మన్, పట్టణ అధ్యక్షులు చంటి, కోశాధికారి రాఘవేంద్ర, రవికుమార్, గుర్రమ్మ, రమాదేవి, మోహన్, ఓబయ్య, సురేష్, శ్రీకాంత్‌తో పాటు మిగతా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.













