రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ నగర బాట కార్యక్రమంలో భాగంగా మోడంపల్లి ప్రాంతంలో విస్తృత పర్యటన నిర్వహించారు. స్థానిక ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. మున్సిపల్ అధికారులు, వార్డు సచివాలయం సిబ్బందితో కలిసి వార్డులలో తిరిగి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నమోదు చేశారు.

మోడంపల్లి ప్రాంతంలో కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపల్, వార్డు సచివాలయం అధికారులు పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ, రోడ్లు వంటి మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గుర్తించిన సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖాధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.
డ్రైన్స్‌పై అక్రమ నిర్మాణాలు ఉండడం వల్ల మురుగు నీరు సరిగా పారకుండా రోడ్లపైకి పోర్లడాన్ని కమిషనర్ గమనించారు. ఈ విషయంపై టౌన్ ప్లానింగ్ సిబ్బందికి తీవ్రంగా సూచనలు చేశారు. అదే సమయంలో స్థానిక ప్రజలకు అవగాహన కల్పించి డ్రైన్స్‌పై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు వారం రోజుల గడువు ఇచ్చారు.
ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు విడుదల చేసిందని తెలిపారు. అధికారులు తమ శాఖాపరిధిలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి ప్రజల్లో సానుకూల దృక్పథం పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని హెచ్చరించారు.

మున్సిపల్ సేవల్లో లోపాలు తలెత్తితే సంబంధిత అధికారులు, సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణపై 70 సంవత్సరాల మహబున్ని పలు సూచనలు చేయగా, వాటిని తప్పనిసరిగా అమలు చేస్తానని కమిషనర్ పేర్కొన్నారు.
ప్రాంతంలో ఎక్కడైనా చెత్త పేరుకుపోయినా, పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించకపోయినా చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. ప్రతిరోజూ శానిటేషన్ పనులను పర్యవేక్షించాలని శానిటేషన్ సూపర్ వైజర్ నూరుబాషాకు ఆదేశాలు ఇచ్చారు.
తాగునీటి సరఫరా సక్రమంగా జరుగుతోందని మోడంపల్లి స్థానికులు సంతృప్తి వ్యక్తం చేయడంతో ఏఈ సురేంద్ర ఆధ్వర్యంలోని వాటర్ వర్క్స్ సిబ్బందిని కమిషనర్ అభినందించారు.

నగర బాట కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, అక్కడికక్కడే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, సమస్యల పరిష్కారానికి కాలపరిమితి విధించి చర్యలు చేపట్టాలని కమిషనర్ సూచించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని తక్షణ పరిష్కారానికి దోహదపడే నగర బాట కార్యక్రమాన్ని కొనసాగిస్తామని కమిషనర్ శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు.
కార్యక్రమంలో డిఈఈ రాజేష్, యశోద, ఏఈలు సురేంద్ర, దస్తగిరి, శానిటేషన్ సూపర్ వైజర్ నూరుబాషా, రెవిన్యూ ఇన్స్పెక్టర్ విజయ్ బాబు, సచివాలయం సిబ్బంది, నాయకులు సూర్యనారాయణ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.













