ప్రొద్దుటూరులోని ఒక బ్యాంకులో జరుగుతున్న పరిణామాలపై స్థానిక ప్రజల్లో చర్చలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బ్యాంకులోని సీసీ కెమెరాల లైవ్ చిత్రాలను మొబైల్ ఫోన్ ద్వారా యాక్సెస్ చేసి బయటకు పంపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఖాతాదారులు, ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బ్యాంకు పాలన, నిర్వహణపై తెలుగు దేశం పార్టీ నేత ప్రవీణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బ్యాంకు వ్యవహారాలపై సహకార శాఖ, రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుల అనంతరం సంబంధిత అధికార యంత్రాంగం కదిలింది.

డిస్ట్రిక్ట్ లెవెల్ కూపెరటివే ఆఫీసర్ సత్యానంద్ ఆధ్వర్యంలో బ్యాంకులో రికార్డుల తనిఖీ జరిగింది. బ్యాంకు నిర్వహణ, రికార్డులపై సమగ్రంగా పరిశీలన జరిపిన DLCO, బ్యాంకు అధికారులకు కొన్ని సూచనలు చేసినట్లు మీడియాకు వెల్లడించారు. DLCO సూచనల తరువాత బకాయిదారులకు నోటీసులు జారీ చేసినట్లు బ్యాంకు వర్గాలు తెలియజేశాయి.

ఇదే సమయంలో రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా అధికారులు కూడా బ్యాంకు రికార్డులపై దృష్టి సారించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజులపాటు RBI అధికారులు బ్యాంకులో రికార్డుల పరిశీలన చేపట్టారు. బ్యాంకు కార్యకలాపాలు, రుణాల మంజూరు, బకాయిల వసూళ్లపై వారు సమగ్రంగా పరిశీలించినట్లు సమాచారం.

బ్యాంకుపై వచ్చిన ఆరోపణల విషయంలో చైర్మన్ ప్రారంభంలో పెద్దగా స్పందించకపోవడంతో, మొదటగా మాజీ చైర్మన్ ముందుకు వచ్చి ఆరోపణలను ఖండించినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. అనంతరం, నష్టం జరిగాక తెలుగు దేశం పార్టీ నేతల ఆదేశాల మేరకు చైర్మన్ రిజాండర్ ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ వరుస సంఘటనలతో బ్యాంకులో ఏదో జరుగుతోందనే అనుమానాలు ప్రజల్లో మరింతగా పెరుగుతున్నాయి. బ్యాంకు కార్యకలాపాల పారదర్శకత, ఖాతాదారుల డిపాజిట్ల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థానికంగా బ్యాంకు విశ్వసనీయతపై చర్చలు సాగుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో బ్యాంకు పాలకవర్గం, అధికారులు ఖాతాదారుల అనుమానాలు, ఆందోళనను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆరోపణలపై స్పష్టమైన వివరణ ఇవ్వడంతో పాటు, రికార్డుల పరిశీలన ఫలితాలను సంబంధిత అధికార యంత్రాంగం, ఖాతాదారులకు తెలియజేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.