ప్రొద్దుటూరు, వైయస్సార్ కడప జిల్లా: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టి. శ్రీనివాస్ విశ్వనాథ్ సోమవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలోని తన చాంబర్‌లో పాత్రికేయులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ అభివృద్ధి, పారిశుధ్యం, అవినీతి ఆరోపణలు తదితర అంశాలపై ఆయన కీలక విషయాలను వెల్లడించారు.

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధి నా ప్రధాన ధ్యేయం.

కమిషనర్ టి. శ్రీనివాస్ విశ్వనాథ్ పట్టణ అభివృద్ధే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా పట్టణంలోని మౌలిక వసతుల కల్పన, ప్రధాన మురుగు కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టడం, అలాగే ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం తన ప్రాధాన్యతలలో ముఖ్యమని తెలిపారు.

ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘స్వచ్ఛ సంకల్ప దీక్ష’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కమిషనర్ ప్రకటించారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో పలు ప్రక్షాళన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పనుల్లో పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ, ఎక్కడా అవినీతికి తావు లేకుండా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులు సాఫీగా సాగేలా శానిటేషన్ సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి సోమవారం ఉదయం చేసిన అవినీతి ఆరోపణలపై కూడా కమిషనర్ స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంబంధిత సిబ్బందిని వెంటనే మరో శాఖకు తాత్కాలిక బదిలీ చేసినట్లు, అదే సమయంలో ఈ విషయంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

మున్సిపల్ సిబ్బంది ఎవరైనా చేతివాటం ప్రదర్శిస్తే తన దృష్టికి నేరుగా తీసుకురావాలి. నా పేరు చెప్పి లేదా నేరుగా నా మీద ఆరోపణలు వచ్చినా ACBని ఆశ్రయించవచ్చు.

అవినీతిపై కఠిన వైఖరి అవలంబిస్తామని కమిషనర్ హెచ్చరించారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేసినట్లు సమావేశంలో పాల్గొన్నవారు తెలిపారు.

పారిశుధ్యంపై రానున్న రోజుల్లో యుద్ధప్రాతిపదికన పనులు ముందుకు సాగేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు కమిషనర్ వెల్లడించారు. పట్టణంలో పారిశుధ్యం, త్రాగునీరు, వీధి దీపాల సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి సోమవారం నిర్వహించే ‘డయల్ యువర్ మున్సిపల్ కమిషనర్’ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు. తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఒక గంటలోనే 26 ఫిర్యాదులు వచ్చినట్లు, వాటిని త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.