రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు పట్టణంలో కొందరు యువకులు వరుసగా అల్లర్లు సృష్టిస్తూ ప్రజల్లో భయాందోళనలు రేపుతున్నారు. నడిరోడ్డుపై గుంపులుగా చేరి ఒకరిపై ఒకరు దాడులకు దిగడం, ఆ సమయంలో అక్కడుగా వెళ్లే సాధారణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఇటీవలి రోజుల్లో ముఖ్యంగా ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులోని పెద్ద గుంత సమీపంలో ఉన్న వైన్ షాప్ వద్ద యువకుల గుంపులు ఘర్షణలకు దిగుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రొద్దుటూరుకు రానున్న నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న సమయంలోనే ఈ ఘటనలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
బైపాస్ ప్రాంతంలోని వైన్ షాప్ వద్ద రెండు వర్గాలుగా విడిపోయిన యువకులు రాళ్లు, పిడుగుద్దులతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అకస్మాత్తుగా ప్రారంభమైన ఈ ఘర్షణతో అక్కడికొచ్చిన వినియోగదారులు, మార్గమధ్యంలో ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఇదే విధంగా ఆగస్టు నెలలో కూడా జమ్మలమడుగు రోడ్డులోని ఓ బార్ వద్ద యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో కర్రలు, బీరు సీసాలతో పరస్పరం దాడులు చేసుకున్న ఘటన స్థానికులను కలవరపరిచింది. బార్ పరిసర ప్రాంతంలో కొంతసేపు గందరగోళం నెలకొనగా, అక్కడి వ్యాపారులు షాపులు మూసివేసి జాగ్రత్తలు తీసుకున్నారు.
ప్రొద్దుటూరులో వరుసగా జరుగుతున్న ఈ తరహా ఘటనలతో మద్యం దుకాణాలు, బార్ల వద్ద భద్రతా చర్యలు పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో యువకుల గుంపులు చేరే ప్రాంతాల్లో పోలీసుల పహారా బలపరచాలని, చిన్నపాటి వాగ్వాదాలు పెద్ద ఘర్షణలకు దారితీయకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
పట్టణంలో శాంతి భద్రతలు కాపాడేందుకు, ప్రజలు భయాందోళనల నుంచి బయటపడేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని, మద్యం దుకాణాల వద్ద సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది ఏర్పాటు వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానిక వర్గాలు సూచిస్తున్నాయి.













