రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: రాష్ట్రంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌పై ఆయన స్పందిస్తూ, ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
చంద్రబాబు పాలనలో అబద్ధాలు, అవినీతి, మోసం, వెన్నుపోటే అజెండాగా మారాయని రాచమల్లు మండిపడ్డారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం లక్షల కోట్లు ఖర్చు చేశామని చెబుతుంటే, ప్రజలు మాత్రం తమకు ఎలాంటి సంక్షేమం అందలేదని అంటున్నారని ఆయన పేర్కొన్నారు. వాతలు, కోతలు, ఎగవేతలతో ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఇదేనని విమర్శించారు.
రాష్ట్రాన్ని రూ. 3.65 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టడం, ఆర్భాటపు ప్రకటనలు చేయడం, ప్రత్యర్థులపై తప్పుడు ఆరోపణలు చేయడంలో చంద్రబాబు ముందున్నారని రాచమల్లు ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు కొండంత హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత గోరంత కూడా అమలు చేయలేదని ఆయన ఆరోపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపద సృష్టించడం గురించి చేసిన వ్యాఖ్యలపై రాచమల్లు తీవ్రంగా స్పందించారు. సంపద సృష్టించడం అంటే "సంతానాన్ని కనడం" అని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రజలను అవమానించేలా ఉన్నాయని ఆయన అన్నారు.
సంపద సృష్టించడం అంటే "సంతానాన్ని కనడం" అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రజలను అవమానించేలా ఉన్నాయి.
డీబీటీ, నాన్-డీబీటీ ద్వారా ఎంత మేర నిధులు విడుదల చేశారో ప్రస్తుత ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించడం లేదని రాచమల్లు విమర్శించారు. రూ. 69 వేల కోట్ల సామాజిక పెన్షన్లను మాత్రమే గొప్పగా చెప్పుకోవడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే అసలైన సంక్షేమం అమలైందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గుర్తుచేశారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా జగన్ ప్రజలకు రూ. 1.31 లక్షల కోట్ల సంక్షేమాన్ని అందించారని ఆయన తెలిపారు. జగన్ ప్రభుత్వం రెండేళ్లలోనే 8.89 కోట్ల మంది లబ్ధిదారులకు, 1.41 కోట్ల కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చిందని వివరించారు.
ఎన్నికల హామీలు మొదటి ఏడాది నుంచే అమలయ్యాయా లేదా అన్న అంశాన్ని ప్రజలు పరిశీలించాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సూచించారు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక నిర్వహణపై ప్రజలు స్వయంగా విశ్లేషించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.













