రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు మండలం తాళమాపురం హరిజనవాడ ఎస్సీ మాలవాడ సమీపంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఆర్.వి. వరలక్ష్మి అనే టీచర్‌పై కులవివక్ష, విధుల పట్ల నిర్లక్ష్యం ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపి ఆమెను విధుల నుండి తప్పించాలని విద్యార్థి యువజన ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తాళమాపురం హరిజనవాడ ఎస్సీ కాలనీలోని ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎక్కువగా ఎస్సీ వర్గానికి చెందినవారు. ఆర్యవైశ్య కులానికి చెందిన టీచర్ వరలక్ష్మి విద్యార్థులపై కులవివక్షత చూపుతూ, చదువు బోధనలో పూర్తిగా విఫలమయ్యారని స్థానిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా, పాఠాలు బోధించడంలో ఆమె వెనుకంజ వేసిందని వినతిపత్రంలో పేర్కొన్నారు.
పాఠశాల 60 రోజులు పనిచేసిన కాలంలో 40 రోజులు వరలక్ష్మి వ్యక్తిగత సెలవులు తీసుకున్నారని, ఆ సమయంలో విద్యార్థులకు పాఠాలు చెప్పిన దాఖలాలు లేవని ఆరోపణలు ఉన్నాయి. ఆ సెలవులను తన ఆర్యవైశ్య సంఘం కార్యక్రమాల కోసం జిల్లా వ్యాప్తంగా తిరగడానికే వినియోగించిందని విద్యార్థి యువజన సంఘాలు పేర్కొన్నాయి.
మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు అందించే గుడ్లను పాఠశాల వద్ద తినకూడదని, ఇంటికి తీసుకెళ్లి తినాలని వరలక్ష్మి హుకుములు జారీ చేసిందని వినతిపత్రంలో ఆరోపించారు. ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థులపై ఈ విధమైన వివక్షత చూపడం రాజ్యాంగ విరుద్ధమని సంఘాలు అభిప్రాయపడ్డాయి.
పాఠశాలలో పనిచేస్తున్న మరో టీచర్‌పై పని ఒత్తిడి ఎక్కువగా పెంచడం, ఎస్సీ కాలనీలో పనిచేస్తున్న ఆయా జీవమ్మను కులవివక్షతో మానసికంగా వేధించడం వరలక్ష్మి ప్రవృత్తిగా మారిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఒక సందర్భంలో టీచర్ వరలక్ష్మి చెప్పులు పక్కకు తీసినప్పుడు, ఆయా జీవమ్మ చేతులు ఆ చెప్పులకు తగిలాయని, ఆ చెప్పులను కంపలో పడేయమని ఆదేశించిందని సంఘాలు ఆరోపించాయి. ఈ ఘటనను అంటరానితనానికి నిదర్శనంగా పేర్కొంటున్నారు.
పాఠశాలలో కులవివక్ష, అంటరానితనం ప్రదర్శించకూడదని చట్టాలు స్పష్టంగా చెబుతున్నప్పటికీ, ఆర్.వి. వరలక్ష్మి వంటి టీచర్ల వల్ల ఇంకా కులవివక్షత రూపుమాపలేదని, మరింతగా కొనసాగుతోందని విద్యార్థి యువజన సంఘాలు అభిప్రాయపడ్డాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన స్థలంలో కులవివక్షత ప్రదర్శించడం వల్ల దళిత విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని వారు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వరలక్ష్మిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు, సమగ్ర విచారణ జరిపి ఆమెను విధుల నుండి తప్పించాలని, స్థానంలో మరో టీచర్ను నియమించి విద్యార్థులకు నిరంతర విద్య అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను విద్యార్థి యువజన ప్రజా సంఘాలు కోరాయి.
ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జి, జిల్లా ఎస్పీ, జిల్లా విద్యాశాఖ పాఠశాల RJD, జిల్లా DEO వెంటనే స్పందించి, పేద దళిత విద్యార్థుల భవిష్యత్తును కాపాడేలా తగిన చర్యలు తీసుకోవాలని సంఘాలు డిమాండ్ చేశాయి.
తాళమాపురం పాఠశాలకు సంబంధించిన సమస్యలపై ప్రగతిశీల విద్యార్థి యువజన సమైక్య రాష్ట్ర కన్వీనర్ ఓబులేసు, మాల మహా సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూడెం చెరువు సంపత్, సుబ్బరాయుడు, షరీఫ్ తదితరుల ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు మండల MEO శోభారాణికి వినతిపత్రం అందజేశారు.













