రాయలసీమ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్:
స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం..
వెనక భాగంలో ఊడిపోయిన టైర్లు
కడపజిల్లా పులివెందులలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మార్కెట్ యార్డ్ సమీపంలో న్యూ వికాస్ ప్రైవేట్ స్కూల్ బస్సుకు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు వెనుక భాగంలోని రెండు టైర్లు ఒక్కసారిగా ఊడిపోవడంతో బస్సు అదుపు తప్పింది. ఆ సమయంలో బస్సులో దాదాపు 30 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఈ ఘటన తీవ్ర భయాందోళనకు గురి చేసింది. స్కూల్ బస్సుల ఫిట్‌నెస్, నిర్వహణపై తగిన పర్యవేక్షణ లేకపోవడమే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని, విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం తగదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.













