రాయలసీమ న్యూస్, అగ్రికల్చర్ డెస్క్: మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం నాగులవరం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు సాంప్రదాయ పంటలను వదిలి బూడిద గుమ్మడి సాగుతో మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, ఏడాది పొడవునా దిగుబడి, మార్కెట్లో స్థిరమైన డిమాండ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయన ఎంచుకున్న ఈ పంట ప్రస్తుతం ఇతర రైతులకు ఆదర్శంగా మారుతోంది.
గతంలో శ్రీనివాసులు పత్తి, మిరప వంటి సాంప్రదాయ పంటలను సాగు చేశారు. అయితే ప్రతి ఏడాది పెట్టుబడులు పెరగడం, ఆశించినంత దిగుబడి రాకపోవడం, వచ్చిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఇచ్చే ప్రత్యామ్నాయ పంటల కోసం విస్తృతంగా పరిశీలించారు. మార్కెట్ అవసరాలు, వినియోగదారుల డిమాండ్‌ను అధ్యయనం చేసిన అనంతరం బూడిద గుమ్మడి సాగును ఎంచుకున్నారు.
ఈ నిర్ణయం ఆయనకు సత్ఫలితాలు ఇచ్చింది. బూడిద గుమ్మడికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం, ధరలు స్థిరంగా ఉండటం వల్ల ఆయనకు లాభాలు రావడం ప్రారంభమైంది. గత దశాబ్దంగా నిరంతరంగా బూడిద గుమ్మడినే సాగు చేస్తూ, తన వ్యవసాయాన్ని పూర్తిగా ఈ పంట చుట్టూ మలిచుకున్నారు.
ఇతర పంటల్లా ఏడాదికి రెండు, మూడు సీజన్లకు పరిమితం కాకుండా, ఏడాది పొడవునా ఏదో ఒక పొలంలో గుమ్మడి దిగుబడి వచ్చేలా శ్రీనివాసులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. విడతల వారీగా సాగు చేసి, ప్రతి నెలా మార్కెట్‌కు సరుకును పంపేలా వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నారు.
బూడిద గుమ్మడి సాగు విధానంపై ఆయన వివరాలు ఇచ్చారు. విత్తనాలను మంగళగిరి నుంచి తెప్పించుకుంటారు. ఒక ఎకరానికి 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల నత్రజని, 20 కిలోల పొటాషియం కలిపి విత్తనాలతో పాటు భూమిలో వేస్తారు. నీరు పెట్టిన 7–8 రోజుల్లో మొలక వస్తుంది. బోదెలకు మధ్య 3 అడుగుల దూరం, ఒక్కొక్క పట్టెకు మధ్య 9 అడుగుల దూరం ఉంచుతారు. ఈ 3 అడుగుల దూరం నీరు కట్టడం, మందులు పిచికారీ చేయడం, మొక్కలను పర్యవేక్షించడానికి అనుకూలంగా ఉంటుంది.
విత్తిన 25–30 రోజుల్లో తీగలు సాగడం ప్రారంభమవుతుంది. ఈ దశకు ముందు కలుపు నివారణ చేసి, తీగలను 9 అడుగుల గ్యాప్‌లో విస్తరించేలా సర్దుతారు. 40వ రోజుకల్లా పూత మొదలవుతుంది. ఈ దశ నుంచి పండు ఈగ ముప్పు ఎక్కువగా ఉండటంతో జాగ్రత్తగా పర్యవేక్షణ అవసరం. పండు ఈగ సోకితే కాయలు వంకరపోవడం, పుచ్చిపోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దీనిని నివారించేందుకు 40వ రోజు నుంచి యాంప్లిగో, బెండాల్, బైఫెన్త్రిన్ వంటి మందులను పిచికారీ చేస్తారు.
మార్కెటింగ్ పరంగా విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు ఉత్పత్తిని పంపిస్తున్నారు. 2.5 నుంచి 4 కిలోల మధ్య బరువున్న గుమ్మడికాయలకు మంచి డిమాండ్ ఉంటుందని శ్రీనివాసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అమరావతి నాట్లు అనే రకానికి ఎక్కువ డిమాండ్ ఉంది. ఇవి ఎకరానికి 10–15 టన్నుల దిగుబడిని ఇస్తాయి, త్వరగా పాడవ్వవు.
బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో సన్బ్రో, ఈస్ట్ వెస్ట్, మైకో వంటి రకాలు వాడుతున్నారని, ఇవి 15–20 టన్నుల దిగుబడిని ఇచ్చినా త్వరగా పాడైపోవడం వల్ల వ్యాపారస్తులు అమరావతి నాట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వివరించారు.







