రాయలసీమ న్యూస్, అగ్రికల్చర్ డెస్క్:
కేరళలోకి నేడు రుతుపవనాలు ప్రవేశం..
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు
నైరుతి రుతుపవనాల ఆగమనం పై వాతావరణ శాఖ తాజా సమాచారం విడుదల చేసింది. రుతుపవనాలు గురువారం కేరళను తాకనున్నాయని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటి వరకు ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వాతావరణ శాఖ వివరాల ప్రకారం, రుతుపవనాలు ఈ రోజు కేరళలోకి అధికారికంగా ప్రవేశించనున్నాయి. గత నెల 26వ తేదీనే రుతుపవనాలు కేరళను తాకుతాయని ముందుగా అంచనా వేసినా, వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల కారణంగా ఆలస్యమై, ఇప్పుడు ప్రవేశిస్తున్నాయని తెలిపింది. ఇప్పటికే కేరళలో తొలకరి వర్షాలు ప్రారంభమైనట్లు అధికారులు పేర్కొన్నారు.
సాధారణంగా కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత అవి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చేరుకుంటాయని ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అంచనా వేస్తోంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొంటే, రుతుపవనాలు రాష్ట్రానికి చేరుకోవడానికి గరిష్టంగా ఏడు రోజుల వరకు సమయం పట్టవచ్చని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోకి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, కేరళలో అధికారిక ప్రవేశం తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
అదే సమయంలో తెలంగాణ లోకి కూడా రుతుపవనాలు దాదాపు సమాన కాలంలోనే ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చిన వాతావరణ శాఖ, కొన్ని ప్రాంతాలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది.
గురువారం నాడు ఆంధ్రప్రదేశ్లోని 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 79 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని AP విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం-మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామ రాజు, పోలవరం పరిసర ప్రాంతాలు ఈ తీవ్ర వడగాల్పుల ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని సూచించింది.
శుక్రవారం నాడు మరికొన్ని మండలాల్లో కూడా తీవ్ర వడగాల్పుల పరిస్థితులు మరింత విస్తరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాల ఆగమనం ఉన్నప్పటికీ, ఈసారి వర్షపాతం రాష్ట్రవ్యాప్తంగా సమానంగా ఉండకపోవచ్చని వాతావరణ శాఖ విశ్లేషణ తెలిపింది.
రాయలసీమ ప్రాంతంలో సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే కోస్తా ఆంధ్ర, ఉత్తర ఆంధ్ర ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో రుతుపవనాల పురోగతి, వర్షాల పంపిణీపై మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపింది.







