రాయలసీమ న్యూస్, అగ్రికల్చర్ డెస్క్:
డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం!
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) యోజన 23వ విడత నిధుల విడుదల తేదీని కేంద్ర సర్కార్ అధికారికంగా ఖరారు చేసింది. వచ్చే జూన్ 20న (ఈ వారంలోనే) దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9 కోట్లకు పైగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా రూ.2,000 చొప్పున నగదు జమ కానుంది. అయితే ఈ నిధులు అందుకోవాలంటే రైతులు ఒక ముఖ్యమైన పనిని తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఏడాదికి రూ.6,000 సహాయం..
రైతులకు పెట్టుబడి సాయం అందించి, వారి ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో 2019లో కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ పథకాన్ని స్టార్ట్ చేసింది. దీని కింద అర్హులైన రైతులకు ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000లను నేరుగా వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తోంది. విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల వంటి వ్యవసాయ అవసరాలకు ఈ నిధులు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయి. గత మార్చి 13న ప్రభుత్వం 22వ విడత కింద రూ.18,640 కోట్లను సుమారు 9.3 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేసిన సంగతి తెలిసిందే.
ఇ-కేవైసీ (e-KYC) లేకపోతే పైసలు రావు..
23వ విడత లబ్ధి పొందడానికి రైతులు తప్పనిసరిగా ఇ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఇ-కేవైసీ అసంపూర్తిగా ఉంటే, సదరు రైతుల ఖాతాలకు ఈ విడత నిధులు బదిలీ కావని స్పష్టం చేసింది. మోసపూరిత లబ్ధిదారులను ఏరివేసి, కేవలం అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిబంధనను కఠినతరం చేసింది.







