రాయలసీమ న్యూస్, అనంతపురం: అనంతపురం జిల్లా రాయదుర్గం–అనంతపురం హైవేపై బ్రాహ్మణపల్లి వద్ద గురువారం తెల్లవారుజాము ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాత్రి 3 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, కళ్యాణదుర్గానికి చెందిన నలుగురు కడూరు వెళ్లి కారులో తిరిగి వస్తున్నారు. బ్రాహ్మణపల్లి సమీపంలో కారుకు అకస్మాత్తుగా నియంత్రణ తప్పి రహదారిపై పల్టీలు కొట్టింది. తీవ్రంగా దెబ్బతిన్న కారులో ఉన్న రాఘవేంద్ర గుప్త, నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు.
కారులో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, ప్రయాణికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందుతోంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కారు పూర్తిగా ధ్వంసమై ఉండటంతో ప్రమాద తీవ్రత అర్థమవుతోంది. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాహనం వేగం, డ్రైవర్ అలసట, రహదారి పరిస్థితులు వంటి అంశాలపై విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేసి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.













