రాయలసీమ న్యూస్, అనంతపురం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహంలో దుర్ఘటన చోటుచేసుకుంది. హాస్టల్ సమీపంలోని పాత భవనం వద్ద గోడ కూలిపోవడంతో 8వ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ మృతి చెందాడు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆదివారం సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో హాస్టల్ దగ్గర ఉన్న పాత భవనం ప్రహరీ గోడ వద్ద హర్షవర్ధన్‌తో పాటు మరో విద్యార్థి అక్షయ్ కుమార్ ఆడుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా పాత ప్రహరీ గోడ కూలిపోవడంతో హర్షవర్ధన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. శెట్టూరు మండలం బసాపురం గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి అక్షయ్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన అక్షయ్ కుమార్‌ను ముందుగా కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి పంపించారు. ప్రమాదంలో అతని కాలు విరగడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
విద్యార్థి మృతి విషయం తెలిసిన వెంటనే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం హర్షవర్ధన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని కుటుంబానికి హామీ ఇచ్చారు.
అక్కడితో ఆగకుండా అదే రాత్రి ఈ ఘటనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తీసుకెళ్లారు. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. జిల్లా యంత్రాంగం కూడా ఘటనపై సమాచారం సేకరించి చర్యలు ప్రారంభించింది.
ఎమ్మెల్యే చొరవతో ఉదయానికే జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి హర్షవర్ధన్ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం మంజూరు అయ్యింది. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆర్డీఓ వసంత్‌బాబు కలిసి ఆసుపత్రిలో కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, తాము కూడా అన్ని విధాలుగా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు మరే విద్యార్థికి జరగకుండా సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన అక్షయ్ కుమార్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం సూచనల మేరకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, సంబంధిత శాఖాధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.
హర్షవర్ధన్ మృతితో శెట్టూరు మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది. విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించేందుకు బంధువులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు ఆసుపత్రికి, వారి గ్రామానికి తరలివస్తున్నారు.













