రాయలసీమ న్యూస్, అనంతపురం: అనంతపురం : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం ప్రారంభమై పదిరోజులు గడిచినా గందరగోళం తగ్గే పేరే లేదు. మొత్తం ప్రక్రియపై ఓటర్లలో అనుమానాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయేమోనన్న భయం ప్రజలను వెంటాడుతోంది.
ఎన్యుమరేషన్ ఫారాల (ఈఎఫ్) పంపిణీ దశలోనే అసలు తికమక మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి కొంతమేర సర్దుకుపోయినా, పట్టణాల్లో మాత్రం దయనీయ స్థితి నెలకొంది. ఓటర్లను ఇంటింటా వెతికినా చిరునామాలు దొరకడం లేదు. ఉద్యోగరీత్యా ప్రాంతాలు మారడం, అద్దె ఇళ్ల మార్పులు, వలసలు వంటి కారణాలతో ఓటర్ల వివరాలు అందుబాటులో లేకపోవడంతో ఫారాల పంపిణీ గగనంగా మారింది.
ఫారాల భర్తీ విషయంలోనూ అయోమయం నెలకొంది. ఈఎఫ్‌లో మూడు పెట్టెలు ఉండటంతో ఎక్కడ, ఏం నమోదు చేయాలో కొందరు బీఎల్‌ఓలకు సరిగా అర్థం కావడం లేదు. విద్యావంతులు సైతం ఫారం ఎలా నింపాలో ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. భర్తీ చేసిన తర్వాత తిరిగి స్వీకరించిన ఫారాల శాతం చాలా తక్కువగా నమోదవుతోంది.
ఈ సర్ కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం కూడా తగినంత ప్రాధాన్యంతో పరిగణించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓ, సూపర్‌వైజర్లు అత్యధికులు క్షేత్రస్థాయిలో పర్యటనలకు వెళ్లడం లేదు. చరవాణి ద్వారా వాకబు చేయడానికే పరిమితం అవుతున్నారు.
ఒక వ్యక్తి ఒకచోట మాత్రమే ఎన్యుమరేషన్ ఫారం నింపాలని, ఒకటికి మించి ఓటు నమోదు చేసుకునే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపుతామని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. పట్టణాలు, పట్టణ శివారు ప్రాంతాల్లోనే సర్ ప్రక్రియ వెనకబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ఆదివారం డీఆర్‌డీఏ, మెప్మా సభ్యులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
రాప్తాడు, అనంత అర్బన్ నియోజకవర్గాల్లో సర్ పురోగతి అధ్వానంగా ఉంది. ఆ తర్వాత శింగనమల, ఉరవకొండ, రాయదుర్గం వెనుకబడ్డ నియోజకవర్గాలుగా నిలిచాయి. ఫారాల స్వీకరణ శాతంలో అనంత అర్బన్‌లో కేవలం 3.15 శాతం మాత్రమే నమోదైంది. శింగనమల, ఉరవకొండల్లో 6 శాతానికి పైగా ఉంది.
జిల్లాలోని 2,226 పోలింగ్ కేంద్రాల్లో 105 కేంద్రాల్లో 20–80 శాతం మధ్యలోనే ఫారాల పంపిణీ జరిగింది. వీటిలో రాప్తాడు నియోజకవర్గంలోనే 39 కేంద్రాలు ఉండటం విశేషం. మొత్తం ఓటర్లు 20,38,527 మంది కాగా, పంపిణీ చేసిన ఫారాలు 19,45,108. ఇప్పటివరకు స్వీకరించిన ఫారాలు 1,81,969 మాత్రమే ఉండటం సర్ అమలులో ఉన్న తికమక స్థాయిని స్పష్టంగా చూపుతోంది.













