రాయలసీమ న్యూస్, అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని పాత గుంతకల్లులో ఆదర్శ నగర్‌లో తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకు పాల్పడ్డారు. బుధవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు నగదు, బంగారం, వెండి ఆభరణాలను అపహరించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. పాత గుంతకల్లులో అంకాలమ్మ గుడి లైనులోని ఆదర్శనగర్ 7వ సచివాలయం ఎదురుగా ఉన్న వీధిలో తిమ్మరాజు కుటుంబం నివాసం ఉంటోంది. తిమ్మరాజు రైల్వే ఉద్యోగి. గుంతకల్లులోని లోకో షెడ్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో తిమ్మరాజు, కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి కాశీ యాత్రకు బయలుదేరారు.
ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున మధ్యలో ఏదో సమయంలో దుండగులు ఇంటి గేటు, తలుపుల తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లోని బీరువాలను బద్దలు కొట్టి అందులో ఉన్న రూ.50 వేలు నగదు, 50 తులాల వెండి, 12 తులాల బంగారు ఆభరణాలను అపహరించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
బుధవారం వేకువజామున ఇంటి గేటు తెరిచి ఉండటాన్ని కాలనీవాసులు గమనించారు. అనుమానం వచ్చి ఇంటి వద్దకు వెళ్లి చూసే సరికి తలుపులు పగులగొట్టబడి ఉండటంతో వెంటనే బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే కాశీకి రైలు ప్రయాణంలో ఉన్న తిమ్మరాజు కుటుంబానికి దొంగతనం జరిగిన విషయం తెలిసింది. దీంతో వారు ప్రయాణాన్ని మధ్యలోనే నిలిపివేసి తిరిగి గుంతకల్లుకు వస్తున్నట్లు తెలిసింది.
సమాచారం అందుకున్న రెండో పట్టణ సీఐ వంశీకృష్ణ బుధవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. ఇంటి పరిసరాల్లో, లోపల పరిస్థితులను పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అనంతపురం నుంచి క్లూస్ టీమ్ సిబ్బంది వచ్చి ఇంట్లోని వివిధ వస్తువులపై, తలుపులపై వేలిముద్రలను సేకరించారు.
దొంగల కదలికలపై సమీపంలోని సీసీ కెమెరా దృశ్యాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. దొంగలను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని, అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని సీఐ వంశీకృష్ణ పేర్కొన్నారు.













