అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణ శివారులో గుంతకల్లు–బళ్లారి రైలు మార్గంలో ఉన్న పడమర గుంతకల్లు రైల్వేస్టేషన్‌ త్వరలో పెద్ద జంక్షన్‌గా రూపాంతరం చెందనుంది. ఇప్పటికే పలు మార్గాలు కలిసే ఈ స్టేషన్‌ను మరింత విస్తరించి, అదనపు లైన్లను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

ప్రస్తుతం పడమర గుంతకల్లు రైల్వేస్టేషన్‌లో నాలుగు రైలు మార్గాలు కలుస్తున్నాయి. సమీప భవిష్యత్తులో మరో మూడు లైన్లను అనుసంధానం చేయనున్నారు. దీంతో మొత్తం ఏడు లైన్లు కలిసే కీలక కేంద్రంగా ఈ స్టేషన్‌ మారనుంది. ఈ నేపథ్యంలో స్టేషన్‌ విస్తరణ పనులను కూడా అధికారులు ప్రారంభించారు.

గుంతకల్లు ప్రధాన రైల్వేస్టేషన్‌లో రైళ్ల బోగీల నిర్వహణకు తగినన్ని లైన్లు లేకపోవడంతో కొత్త రైళ్లను ప్రారంభించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు పడమర గుంతకల్లు స్టేషన్‌ను బోగీల నిర్వహణ కేంద్రంగా వినియోగించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.

నంచెర్ల స్టేషన్‌ నుంచి ఒక లైన్‌, మల్లప్పగేటు రైల్వేస్టేషన్‌ నుంచి రెండు లైన్లను పడమర గుంతకల్లు స్టేషన్‌లోకి కలపనున్నారు. ఈ పనుల కోసం రైల్వే బోర్డు రూ.350 కోట్లు కేటాయించింది. భూమి మీదుగా కాకుండా వంతెనలను నిర్మించి, వాటిపై కొత్త లైన్లను ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

అదేవిధంగా, ఈ స్టేషన్‌ నుంచి బళ్లారి వరకు ఇప్పటికే ఉన్న డబుల్‌ లైన్‌కు తోడుగా మరో రెండు లైన్లను ఏర్పాటు చేయడానికి రైల్వే బోర్డు అనుమతులు ఇచ్చింది. ఈ అదనపు లైన్ల కోసం సుమారు రూ.400 కోట్లు వ్యయం చేయనున్నారు. ప్రయాణికుల రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ అదనపు లైన్ల నిర్మాణాన్ని చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు.

గూడ్సు రైళ్లు తప్పనిసరిగా గుంతకల్లు జంక్షన్‌లోకి రావాల్సిన అవసరం లేకుండా, పడమర గుంతకల్లు స్టేషన్‌ ద్వారా వివిధ మార్గాల గుండా నేరుగా వెళ్లేలా సదుపాయాలు కల్పించనున్నారు. దీంతో గుంతకల్లు జంక్షన్‌పై ఉండే రద్దీ తగ్గే అవకాశం ఉంది. త్వరలో బళ్లారి వరకు ప్రతిపాదిత లైన్ల ఏర్పాటు కోసం టెండర్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్టు రైల్వే అధికారులు వివరించారు.