దశాబ్దంగా ఆర్టీసీలో నియామకాలు లేవని ఆవేదన

ఈడీ అడ్మిన్‌కు ఉద్యోగుల JAC మెమోరాండం

విజయవాడ : ఏపీఎస్ఆర్టీసీలో దాదాపు దశాబ్దంగా రిక్రూట్‌మెంట్ జరగకపోవడంతో సంస్థ తీవ్ర సిబ్బంది కొరతను ఎదుర్కొంటోందని ఉద్యోగుల JAC ఆవేదన వ్యక్తం చేసింది. నియామకాల నిలిపివేతతో పాటు పలు పెండింగ్‌ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం విజయవాడలోని RTC ప్రధాన కార్యాలయంలో ఈడీ అడ్మిన్‌కు మెమోరాండం అందజేసింది.

ఉద్యోగుల JAC ప్రతినిధులు సమర్పించిన వినతిపత్రంలో సంస్థలో కొత్త నియామకాలు చేపట్టాలని, ఐఆర్, పీఆర్సీ అమలు, కొత్త బస్సుల కొనుగోలు, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ వంటి కీలక అంశాలపై యాజమాన్యం దృష్టి సారించాలని కోరారు. సిబ్బంది కొరత, వేతనాలు, సేవా నియమావళి, వాహనాల నిర్వహణ వంటి అంశాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని JAC అభిప్రాయపడింది.

స్త్రీశక్తి కారణంగా వర్క్‌లోడ్‌ గణనీయంగా పెరిగిందని, దీనివల్ల ప్రస్తుత సిబ్బందిపై అదనపు భారం పడుతోందని JAC మెమోరాండంలో పేర్కొంది. బస్ లోడ్ తగ్గించేలా తగిన చర్యలు తీసుకోవాలని, రూట్ల పునర్వ్యవస్థీకరణ, షిఫ్ట్‌ల సక్రమ విభజన వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని యాజమాన్యాన్ని కోరింది.

విలీనం అనంతరం అమల్లో ఉన్న EHS వల్ల ఉద్యోగులకు సరైన ప్రయోజనం లేకపోవడంతో, పాత RTC మెడికల్ సౌకర్యాన్ని తిరిగి కల్పించేలా చర్యలు తీసుకోవాలని JAC డిమాండ్‌ చేసింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రతపై సంస్థ మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని వినతిపత్రంలో స్పష్టం చేసింది.

ఇప్పటికే APSRTC ఉద్యోగ సంఘాలన్నీ కలసి JACగా ఏర్పాటైన విషయం తెలిసిందే. సమిష్టి వేదికగా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ, యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లాలని ఈ వేదిక లక్ష్యంగా పెట్టుకుంది.

తమ డిమాండ్ల పరిష్కారానికి దిశగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఉద్యోగుల JAC ప్రకటించింది. జూన్ 16 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ సమాయత్త సభలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అనంతరం జూన్ 26, 27 తేదీల్లో ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసనలు, ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది.

జూన్ 28న తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని ఉద్యోగుల JAC వెల్లడించింది. అప్పటి వరకు ప్రభుత్వం, RTC యాజమాన్యం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని JAC ఆశాభావం వ్యక్తం చేసింది.