రాయలసీమ న్యూస్, క్రైమ్ డెస్క్:
జ్ఞానేశ్వరి జాడ తెలిసేదెలా?.. పది రోజులైనా వీడని మిస్టరీ
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల సుంకర జ్ఞానేశ్వరి (జానూ) అదృశ్యమై పది రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడంతో మిస్టరీ మరింత గాఢమవుతోంది. చిన్నారి ఎక్కడికి వెళ్లిందో, ఎలా అదృశ్యమైందో ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో స్థానికులతో పాటు తెలుగు రాష్ట్రాలవ్యాప్తంగా ఈ ఘటనపై చర్చ నడుస్తోంది.
ఈ నెల 6న ఇంటి సమీపంలోని తోట ప్రాంతంలో ఆడుకుంటూ ఉన్న జ్ఞానేశ్వరి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు మొదట స్వయంగా గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. అప్పటి నుంచి వందలాది మంది పోలీసు సిబ్బంది, అటవీ శాఖ, NDRF తదితర బృందాలు తోట, కొండ ప్రాంతాలను అంగుళం అంగుళం జల్లెడ పడుతున్నా ఏ ఆధారమూ దొరకకపోవడం విచారకరం.
చిన్నారి అదృశ్యమైన పరిసరాల్లో అడవి జంతువుల సంచారం ఉన్నట్టు ఇప్పటివరకు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు సమీప ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలు, ఫోన్ కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలను ఖంగుతట్టి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కేసు పురోగతిలో పెద్దగా మార్పు కనిపించకపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
జిల్లా ఎస్పీ బిందుమాధవ్ సోమవారం తునికి వెళ్లి దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వారి మనోధైర్యాన్ని పెంపొందించేలా భరోసా ఇచ్చారు. సంబంధిత అధికారులతో సమావేశమై ఇప్పటివరకు చేపట్టిన చర్యలను, భవిష్యత్ వ్యూహాన్ని సమీక్షించారు.
చిన్నారి అదృశ్యంపై అన్ని కోణాల్లో విస్తృత స్థాయిలో దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి క్లూ లభించలేదని, సాంకేతిక ఆధారాలు కూడా దొరకలేదని ఎస్పీ అధికారికంగా వెల్లడించారు. జ్ఞానేశ్వరి అదృశ్యమైన పరిస్థితులను బట్టి ముందస్తు ప్రణాళికతో అపహరణ జరిగిందని చెప్పలేమని, చిన్నారి తనంతట తానే నడిచి వెళ్లి ఉండొచ్చని తల్లిదండ్రుల వాంగ్మూలం ఆధారంగా భావిస్తున్నట్టు తెలిపారు. చిన్నారి కనిపించిన తర్వాత ఎవరైనా తీసుకెళ్లారా అన్న కోణంలోనూ విచారణ కొనసాగుతోందని, ఇంకా ఏ అంశంపైనా స్పష్టత రాలేదని ఆయన పేర్కొన్నారు.
జ్ఞానేశ్వరి ఆచూకీ తెలిపిన వారికి ఒక లక్ష రూపాయల నగదు బహుమతి ప్రకటించినట్టు పోలీసులు వెల్లడించారు. చిన్నారి వెంట వెళ్లి తిరిగి వచ్చిన శునకం డీహైడ్రేషన్‌కు గురై మృతి చెందగా, దాని పోస్టుమార్టమ్ నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని కోణాల్లో పరిశీలన కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. కేసు చుట్టూ పుట్టుకొస్తున్న పుకార్లను నమ్మవద్దని, అవాస్తవ ప్రచారంతో దర్యాప్తుకు ఆటంకం కలిగించవద్దని పోలీసు వర్గాలు ప్రజలను కోరుతున్నాయి.
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వమూ దృష్టి సారించింది. చిన్నారి సురక్షితంగా తిరిగి రావాలన్న ఆకాంక్షతో గ్రామస్తులు, బంధువులు రోజూ వేచిచూస్తున్నారు. తుని, పరిసర ప్రాంతాల్లో జ్ఞానేశ్వరి ఫొటోలు, వివరాలతో మిస్సింగ్ ప్రకటనలు విస్తృతంగా ప్రదర్శిస్తున్నారు. అయితే పది రోజులు గడిచినా ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఈ కేసు మిస్టరీగా మారిపోయింది.







