రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్:
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి పనులకు శ్రీకారం
సొంత నియోజక వర్గం మంగళగిరి అభివృద్ధిపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. మంగళగిరి దిగువ సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ, అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆలయ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో దేవాలయ పునరుద్ధరణ, సౌకర్యాల విస్తరణ, భక్తుల సౌలభ్యాల పెంపు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ఆలయ ప్రస్తుత పరిస్థితి, అవసరమైన నిర్మాణ, మరమ్మత్తు పనులపై సంబంధిత శాఖల అధికారులు మంత్రి నారా లోకేష్‌కు వివరాలు అందించారు.
ఆలయ అభివృద్ధి ప్రతిపాదనలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి ముందు ఉంచారు. దేవాలయ పరిసరాల సుందరీకరణ, రహదారి సౌకర్యాల మెరుగుదల, పార్కింగ్ వంటి అంశాలు కూడా ఈ ప్రజెంటేషన్‌లో భాగమైనట్లు తెలిసింది. భక్తుల రద్దీ, పండుగల సమయంలో ఏర్పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన సదుపాయాలపై అధికారులు సమగ్ర నివేదిక సమర్పించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలోని శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణకు మంత్రి నారా లోకేష్ ఆమోదం తెలిపారు. చారిత్రక, శిల్పకళా ప్రాధాన్యం కలిగిన ఈ మండపాన్ని మూల స్వరూపానికి భంగం కలగకుండా, నిపుణుల పర్యవేక్షణలో పునరుద్ధరించాలని అధికారులకు సూచించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
అలాగే ఆలయంలో యాగశాల, గంట మండపం పునర్నిర్మాణానికి కూడా మంత్రి ఆమోదం తెలిపారు. ప్రస్తుత నిర్మాణాల జీర్ణావస్థను పరిగణనలోకి తీసుకుని, భద్రతా ప్రమాణాలు, శాస్త్రోక్త విధానాలకు అనుగుణంగా కొత్త నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. భక్తుల వాహనాల కోసం వాహనశాల నూతన నిర్మాణ ప్రతిపాదనకు కూడా సమావేశంలో ఆమోదం లభించింది. దేవాలయ అభివృద్ధి పనులను దశలవారీగా అమలు చేయాలని, పనుల నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచించినట్లు తెలిసింది. భక్తుల సౌకర్యాలు, ఆలయ గౌరవం, ఆధ్యాత్మిక వాతావరణం దృష్ట్యా అన్ని పనులు సమయానికి పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.







