రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: విశాఖపట్నం జిల్లా పెందుర్తి–ఆనందపురం జాతీయ రహదారి పై గండిగుండ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ముందున్న లారీని ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం, పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లకు చెందిన పాలగాని రామాంజినేయులు, షేక్ మీరావలి, మందపాటి చంద్రశేఖర్, అతని కుమారుడు మందపాటి భవానీశంకర్, నరసరావుపేటకు చెందిన కారు డ్రైవర్ శ్రీను కలిసి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆనందపురం సమీపానికి రాగానే ప్రమాదం జరిగింది.
ఆనందపురం వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ఓవర్టేక్ చేయబోయి ముందున్న లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఢీకొట్టిన ప్రభావంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ఉన్నవారు వాహనంలో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. వాహనాన్ని క్రేన్ సాయంతో రహదారి పక్కకు తరలించారు.
ఈ ప్రమాదంలో ఇనుమెళ్లకు చెందిన పాలగాని రామాంజినేయులు (51), షేక్ మీరావలి (56), మందపాటి భవానీశంకర్ (11), డ్రైవర్ శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు. మందపాటి చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడగా, అతన్ని భీమిలి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
మృతుల స్వగ్రామాలైన ఇనుమెళ్ల, నరసరావుపేట ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే ప్రమాదంలో కుటుంబ సభ్యులు, పరిచయస్తులు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తులు మిగుల్చిన దుఃఖంలో మునిగిపోయారు. శుభకార్యానికి బయలుదేరిన ప్రయాణం విషాదంగా మారింది.
చంద్రశేఖర్ పల్నాడు జిల్లా నరసరావుపేటలోని అమూల్య నర్సింగ్ హోమ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నట్టు స్థానికులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వాహనాల వేగం, ఓవర్టేక్ సమయంలో నిర్లక్ష్యం వంటి అంశాలపై విచారణ కొనసాగిస్తున్నారు.







