రాయలసీమ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్:
రాయలసీమను దేశంలో అగ్రగామి పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి టీజీ భరత్
రాయలసీమను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను ప్రారంభించినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. "రైజింగ్ రాయలసీమ" ఒక నినాదం మాత్రమే కాకుండా, ప్రభుత్వ సంకల్పానికి ప్రతిరూపమని ఆయన స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో దేశంలో ముందంజలో నిలపడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాయలసీమ అభ్యున్నతి, పారిశ్రామిక వికాసం, పెట్టుబడుల ప్రోత్సాహం, నవకల్పనలపై సమర్థ రీసెర్చ్&రిసర్జెన్స్ “రైజింగ్ రాయలసీమ: ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ & ఇన్వెస్ట్మెంట్” సదస్సు స్థానిక జడ్పీ సమావేశపు మందిరం లో నిర్వహించ గా... ఈ సదస్సు కు ముఖ్య అతిథులు గా రాష్ట్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై.సత్య కుమార్, ప్రభుత్వ విప్ జమ్మల మడుగు శాసన సభ్యులు ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బి రామ్ గోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితో పాటు వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విసి డా. బి.జయరామి రెడ్డి,...భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్, శ్రీధర్.. తదితరులు పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా దశాబ్దాలుగా కరువు, వలసలతో వెనుకబడిన రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రభుత్వం లక్ష్యబద్ధంగా చర్యలు చేపట్టిందని టీజీ భరత్ వివరించారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలను ప్రధాన పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చేయడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని ఆయన పిలుపునిచ్చారు. రాయలసీమలో పరిశ్రమల స్థాపనకు వ్యూహాత్మక భౌగోళిక స్థానం, విస్తారమైన భూముల లభ్యత, నాణ్యమైన విద్యుత్ సరఫరా, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ప్రధాన బలాలుగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలకు సమీపంలో ఉండటంతో పాటు కృష్ణపట్నం, చెన్నై పోర్టులకు అనుసంధానం ఈ ప్రాంతానికి అదనపు ప్రయోజనమని తెలిపారు.
రాయలసీమ సహజ వనరుల నిలయమని టీజీ భరత్ గుర్తుచేశారు. మంగంపేట బైరైటీస్, తుమ్మలపల్లి యురేనియం, యర్రగుంట్ల సున్నపురాయి, చిత్తూరు-కడప గ్రానైట్, కర్నూలు ఇనుప ఖనిజం వంటి వనరులు పరిశ్రమల అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తున్నాయని చెప్పారు. కడప అరటి, బత్తాయి, దానిమ్మ, అనంతపురం వేరుశనగ, కర్నూలు మిర్చి, చిత్తూరు మామిడి వంటి వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి మార్కెట్ అవకాశాలు ఉన్నాయని వివరించారు.
ఈ వనరుల ఆధారంగా భారీ, మధ్యతరహా పరిశ్రమలు, ఆహార శుద్ధి పరిశ్రమలు, ఫార్మా రంగం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధన రంగం, పర్యాటక రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటు చేసి అరటి, బత్తాయి, మామిడి, టమాటా, ఉల్లి వంటి ఉత్పత్తులకు విలువ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కొప్పర్తి, హిందూపురం, నాయుడుపేట ప్రాంతాల్లో ఫార్మా క్లస్టర్లు, ఓర్వకల్లు ప్రాంతంలో రక్షణ, ఏరోస్పేస్ పరిశ్రమలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని టీజీ భరత్ తెలిపారు. పునరుత్పాదక ఇంధన రంగంలో రాయలసీమ ఇప్పటికే దేశంలో ముందంజలో ఉందని, సౌర, పవన విద్యుత్‌తో పాటు హరిత హైడ్రోజన్, బ్యాటరీ తయారీ, ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు చెప్పారు. రాయలసీమను దేశ "హరిత ఇంధన రాజధాని"గా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు.
గండికోట, బెలూం గుహలు, తిరుమల, శ్రీశైలం, మంత్రాలయం, అహోబిలం, దేవుని కడప, పుష్పగిరి వంటి ప్రాంతాలను అనుసంధానిస్తూ ఆధ్యాత్మిక, పర్యాటక వలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి తెలిపారు. దీని ద్వారా పర్యాటక రంగంలో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అన్నారు.
రాబోయే ఐదేళ్లలో రాయలసీమలో పది లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీజీ భరత్ స్పష్టం చేశారు.







