సెక్షన్ 22-Aకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వ ఉత్తర్వు (జీవో)ను విడుదల చేయనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ, దేవాదాయ, అసైన్డ్, సీలింగ్ మిగులు భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేలా 22-Aను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. 2007లో తీసుకొచ్చిన ఈ విధానంలో సమూల మార్పులు చేస్తూ, ఇప్పటివరకు అమల్లో ఉన్న పాత సర్క్యులర్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

కొత్త జీవో అమలులోకి రావడంతో 22-A జాబితాలో ఉన్న భూములను తొలగించే ప్రక్రియ సులభతరం కానుందని మంత్రి చెప్పారు. అదే సమయంలో కొత్త భూములను ఈ జాబితాలో చేర్చే విషయంలో మాత్రం అత్యంత కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఇకపై మ్యాన్యువల్ ఎంట్రీలను పూర్తిగా నిషేధిస్తూ, ప్రతి వారం వెబ్ ల్యాండ్ 2.0 డేటాను IGRS డేటాబేస్‌తో సమకాలీకరించనున్నట్లు మంత్రి వివరించారు. నిషేధిత ఆస్తుల వివరాలన్నింటినీ ఓపెన్ డొమైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపారు.

గ్రామకంఠం, పట్టా భూములు, విల్ఏజ్ సర్వీస్ ఇనాం భూములను అనవసరంగా 22-A జాబితాలో చేర్చినట్లయితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. అలాగే చట్టబద్ధంగా క్రమబద్ధీకరించిన ULC భూములు, APSFC వేలంలో కొనుగోలు చేసిన భూములను అర్హత మేరకు 22-A నుంచి తొలగించే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.

కోర్టు ఉత్తర్వులు వచ్చిన ఐదు రోజుల్లోనే సుబ రిజిస్ట్రార్ లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఏదైనా భూమిని 22-A జాబితాలో చేర్చే ప్రక్రియను క్వాసి జ్యూడిషాల్ ప్రక్రియగా పరిగణిస్తారని, భూమిని చేర్చే ముందు యజమానికి నోటీసు జారీ చేసి, విచారణ జరిపిన తర్వాతే స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలని నిబంధనలు స్పష్టంగా పేర్కొంటున్నాయని వివరించారు.

భూమి ప్రభుత్వానిదని నిరూపించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుందని, భూ యజమానులపై ఆ బాధ్యత ఉండదని మంత్రి తెలిపారు. 22-A జాబితాలో భూమిని చేర్చడం లేదా తొలగించే అధికారం RDO లేదా సబ్ కలెక్టర్ కు ఉండగా, వీరి నిర్ణయంపై జాయింట్ కలెక్టర్ అప్పీలేట్ అథారిటీగా వ్యవహరించనున్నట్లు చెప్పారు.

నూతన సాఫ్ట్‌వేర్ వ్యవస్థను 90 రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అయితే కొత్త జీవో నిబంధనలు మాత్రం తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గతంలో రీసర్వే జరిగిన 6,688 గ్రామాల్లో తప్పులను సరిదిద్దుతున్నామని, త్వరలోనే మరో 4 వేల గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయనున్నట్లు చెప్పారు.

రైతులు, పేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ వ్యవస్థలో పారదర్శక సంస్కరణలు తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.