రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్:
చెత్త తొలగింపులో నిర్లక్ష్యం..
మున్సిపల్ అధికారులపై మంత్రి నాదెండ్ల ఆగ్రహం
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని తూర్పు కాల్వకట్ట రోడ్డులో చెత్త తొలగింపు పనుల్లో నిర్లక్ష్యం కారణంగా మున్సిపల్ అధికారులపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో పేరుకుపోయిన వ్యర్థాలపై స్థానికుల ఫిర్యాదుతో బుధవారం ఉదయం మంత్రి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
రెండు రోజుల క్రితం అదే ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చెత్త కుప్పలు పేరుకుపోయాయని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే అక్కడి వ్యర్థాలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్, సిబ్బందికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆదేశాల అమలులో మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శించినట్టు బుధవారం జరిగిన తనిఖీల్లో బయటపడింది.
ఉదయం తిరిగి ఆ ప్రాంతానికి వెళ్లిన నాదెండ్ల మనోహర్ అక్కడ చెత్త కుప్పలు యథావిధిగా ఉండటాన్ని గమనించారు. దీనిపై ఆయన మున్సిపల్ సిబ్బందిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులను ఘటనాస్థలికి రప్పించి, తన ఆదేశాల తర్వాత కూడా ఎందుకు చెత్త తొలగించలేదని ప్రశ్నించారు.
చెత్త కుప్పలు చాలా ఎక్కువగా ఉన్నాయని, వాటిని తొలగించేందుకు టెండర్ పిలిచే ప్రక్రియలో ఉన్నామని మున్సిపల్ సిబ్బంది మంత్రి ముందు వివరణ ఇచ్చారు. ఈ సమాధానంపై నాదెండ్ల మనోహర్ అసహనం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీకి ఉన్న JCB, ట్రాక్టర్లతో చేయగలిగే పనికీ టెండర్ అవసరమా అన్న భావాన్ని ఆయన అధికారులకు స్పష్టంగా తెలియజేశారు.
పనిచేయాలనే ఉత్సాహం లేకపోతే సెలవుపై వెళ్లిపోవచ్చని మంత్రి మున్సిపల్ సిబ్బందిని హెచ్చరించినట్టు అక్కడి వర్గాలు తెలిపాయి. తాను ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడం సహించబోమని ఆయన అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం.
వ్యర్థాలు పూర్తిగా తొలగించే వరకు అక్కడి నుంచి కదలిక ఉండదనే సంకేతంగా నాదెండ్ల మనోహర్ కాల్వగట్టుపై ఉన్న బల్లపై కూర్చున్నారు. దీంతో మున్సిపల్ యంత్రాంగం హడావుడిగా అక్కడికి చేరుకుంది. అధికారులు, సిబ్బంది తక్షణమే చెత్త తొలగింపు పనులు ప్రారంభించారు.
మంత్రి ఆకస్మిక తనిఖీలతో తెనాలి మున్సిపల్ కార్యాలయంలో కదలికలు చురుగ్గా మారాయి. పట్టణంలో ఇతర ప్రాంతాల్లోనూ చెత్త నిర్వహణ, శుభ్రతపై అధికారులు పునర్విమర్శ చేపట్టే అవకాశమున్నట్టు మున్సిపల్ వర్గాలు సూచిస్తున్నాయి.







