విజయవాడలో త్వరలో రాష్ట్ర స్థాయి భారీ సూఫీ కాన్ఫరెన్స్

అమరావతి: విజయవాడ నగరంలో త్వరలోనే రాష్ట్ర స్థాయి భారీ సూఫీ కాన్ఫరెన్స్‌తో పాటు బహిరంగ మహాసభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర సూఫీ మత పెద్దలు ప్రకటించారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా, పెనుగొండ నియోజకవర్గంలోని పవిత్ర హజరత్ సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ రహ్మతుల్లాహి అలైహి దర్గా షరీఫ్‌లో రాష్ట్ర సూఫీ మత ప్రముఖుల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సూఫీ తాజ్ బాబా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మషాయిఖ్‌లు, పీఠాధిపతులు, ముతవల్లీలు, మురీదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విజయవాడలో బహిరంగ మహాసభ నిర్వహణకు సంబంధించిన తీర్మానాన్ని ప్రతినిధులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మహాసభలో సుమారు 5,000 మంది ఫకీర్లు పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించారు. పెనుగొండ దర్గాలో జరిగిన ఈ సమావేశానికి జాంపని అతా ముహమ్మద్ నిజాముద్దీన్ షా తాజ్ ఖాదరీ (హజరత్ తాజ్ బాబా) అధ్యక్షత వహించారు. రాష్ట్ర ముతవల్లీల సంఘం అధ్యక్షులు కె.ఎం. షకీల్ షఫీ, ప్రధాన కార్యదర్శి ఉబేదుల్లా సాహెబ్, తెనాలి ప్రాంత సూఫీ పెద్దలు, రాష్ట్రంలోని వివిధ దర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ కాన్ఫరెన్స్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకతను తీసుకురావడానికి ఇరాన్, ఇరాక్ దేశాల నుండి ప్రముఖ సూఫీ మత గురువులు, అంతర్జాతీయ ఆధ్యాత్మిక వేత్తలను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తున్నారు. వీరి రాకతో మహాసభకు విశేషమైన ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాధాన్యం ఏర్పడనుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుండి సుమారు 5,000 మంది ఫకీర్లు, జలాలీ ఫుఖ్రాలు, రిఫాయీలు, ముర్షిద్‌లు, బాన్వాలు, ఖలందరీలు ఈ మహాసభకు తరలిరానున్నారు. సూఫీ సంప్రదాయాల పరిరక్షణ, మానవతా విలువల ప్రచారం, సర్వమత సౌహార్ద్రం, ఆధ్యాత్మిక చైతన్య విస్తరణ ఈ మహాసభ ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయించారు.