రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్:
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై దర్యాప్తు
విశాఖపట్నం : విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన పేలుడు ప్రమాదం క్షణాల్లోనే ఘోర రూపం దాల్చింది. దగ్గరలో పనిచేస్తున్న కార్మికులు ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు గానీ, గాయపడిన వారికి సాయం చేసేందుకు గానీ ఏమాత్రం అవకాశం లేకుండా ఘటన జరిగిపోయినట్లు ప్రాథమిక సమాచారం చెబుతోంది. స్టీల్ ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా బ్లాస్ట్ ఫర్నేస్‌లో తయారైన ద్రవపు ఉక్కు (హాట్ మెటల్)ను ల్యాడిల్ ద్వారా స్టీల్ మెల్టింగ్ షాపు (ఎస్‌ఎంఎస్) విభాగానికి తరలిస్తుంటారు. సాధారణంగా ఇది 1,500 నుంచి 2,000 డిగ్రీల వరకు అత్యధిక వేడితో ఉండే ద్రవ లోహం కావడంతో అత్యంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. అప్పుడప్పుడు ల్యాడిల్ బ్యాలెన్స్ తప్పి కొంత హాట్ మెటల్ కిందకు జారిపడటం, లేదా ల్యాడిల్‌లో రంధ్రం ఏర్పడి కారిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ, ఈసారి అలాంటి పరిస్థితి ఏదీ లేకుండానే ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.
150 టన్నుల ద్రవపు ఉక్కు..
సంఘటన జరిగిన సమయంలో ల్యాడిల్‌లో సుమారు 150 టన్నుల ద్రవపు ఉక్కు ఉన్నట్లు ప్లాంట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదో కారణంతో ల్యాడిల్‌లోని హాట్ మెటల్ ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు తీవ్రతకు ల్యాడిల్ తునాతునకలైపోయి, అందులోని ద్రవపు ఉక్కు నలువైపులా చెల్లాచెదురుగా ఎగిరిపడింది. క్షణాల్లోనే అక్కడికక్కడే మంటలు చెలరేగి పరిసర ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
హాట్ మెటల్ కింద పడిన ప్రాంతానికి సమీపంలోనే కంట్రోల్ రూమ్ ఉండటంతో, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు కూడా మంటల్లో చిక్కుకున్నారు. మంటల తీవ్రత కారణంగా కొందరు కార్మికులు అగ్నికీలల్లో కాలిపోయి గుర్తుపట్టలేని స్థితికి చేరినట్లు సమాచారం చెబుతోంది. ప్రమాదం అంత వేగంగా జరిగిపోవడంతో, సమీపంలో ఉన్నవారు స్పందించేలోపే పరిస్థితి అదుపు తప్పినట్లు తెలుస్తోంది.ల్యాడిల్ పైభాగంలో ద్రవపు ఉక్కుతో నిండిన స్థితిలో ఉండగానే ఇలా ఒక్కసారిగా పేలిపోవడం విశాఖ స్టీల్‌ప్లాంట్ చరిత్రలో ఇదే మొదటిసారి అని ప్లాంట్ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ల్యాడిల్ నుంచి కారిపోవడం, జారిపడడం వంటి ప్రమాదాలు నమోదైనప్పటికీ, ల్యాడిల్ పూర్తిగా పేలిపోవడం ఇప్పటివరకు జరగలేదని పేర్కొంటున్నారు.
వెలుగులోకిరాని కారణాలు..
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. ద్రవపు ఉక్కు ఉష్ణోగ్రత, ల్యాడిల్ సాంకేతిక స్థితి, భద్రతా ప్రమాణాల అమలు వంటి అంశాలపై సంబంధిత విభాగాలు దర్యాప్తు చేపట్టనున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.







