విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం

9 మంది కార్మికుల మృతి

విశాఖపట్ నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సోమవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌–2, ఎస్‌టీసీ–3 హీట్‌ ఎఫ్‌జీలో స్టీల్‌ మెటల్‌ లిక్విడ్‌ ల్యాడిల్‌ అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో అందులోని ఉక్కు ద్రవం బయటకు చిమ్మి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది కార్మికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సుమారు 1,500 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద స్టీల్‌ మెటల్‌ లిక్విడ్‌ ల్యాడిల్‌ ద్వారా ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్‌ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం చెబుతోంది. ఒక్కసారిగా ల్యాడిల్‌ పేలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో అప్పారావు, ప్రభాకర్‌రావు, కృష్ణ, రమణ, త్రినాథ్‌, అప్పలరాజు, కుమార్‌ పేర్లు గుర్తించారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల్లో ఐదుగురు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు కాగా, ముగ్గురు ఒప్పంద కార్మికులని అధికారులు తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంపై దేశవ్యాప్తంగా స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ప్లాంట్‌ అధికారులు రక్షణ చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అంతర్గత విచారణ ప్రారంభించినట్లు సమాచారం. భద్రతా ప్రమాణాల అమలు, పరికరాల పనితీరు, నిర్వహణ విధానాలపై కూడా అధికారులు సమీక్ష చేపడుతున్నారు.

ఈ ఘటనతో స్టీల్‌ప్లాంట్‌ పరిసర ప్రాంతాల్లో విషాద వాతావరణం నెలకొంది. సహచర కార్మికులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రులు, ప్లాంట్‌ పరిసరాల్లో ఆందోళనతో వేచి చూస్తున్నారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి సహాయం అందించేందుకు ప్లాంట్‌ యాజమాన్యం, స్థానిక అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఈ ప్రమాదం నేపథ్యంలో స్టీల్‌ పరిశ్రమల్లో కార్మికుల భద్రత, పరికరాల నిర్వహణపై మరోసారి చర్చ మొదలైంది. భారీ ఉష్ణోగ్రతల వద్ద పనిచేసే యూనిట్లలో అదనపు జాగ్రత్తలు, కఠిన భద్రతా నిబంధనలు అవసరమని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఇటీవలి కాలంలో జరిగిన ప్రమాదాలపై సమగ్ర సమీక్ష చేసి, తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలపై అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కార్మికుల మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అలాగే అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసి సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించాలని చంద్రబాబు సూచించారు.