అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రయాణికులు, పాదచారుల ప్రాణాలను రక్షించేందుకు జిల్లా యంత్రాంగం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ దిశగా మదనపల్లె కలెక్టరేట్‌లో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ (DRSC) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం కీలకంగా నిలిచింది.

జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శ్రీ శివ్ నారాయణ శర్మ, IAS, జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, IPS సమావేశానికి హాజరై, రహదారి భద్రతకు సంబంధించి వివిధ శాఖల అధికారులకు స్పష్టమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలకు శాశ్వతంగా చెక్ పెట్టడం, ప్రజల ప్రాణ భద్రతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోంది.

సమావేశంలో కలెక్టర్ శివ్ నారాయణ శర్మ రోడ్డు భద్రతా చర్యలను తక్షణం అమలు చేయాల్సిన అవసరాన్ని అధికారులకు వివరించారు. పాఠశాలలు, కళాశాలలు, రద్దీ ప్రాంతాల వద్ద పాదచారుల రక్షణకు జీబ్రా క్రాసింగ్‌ల ఏర్పాటు అత్యవసరమని సూచించారు. నేషనల్ హైవేలపై దుమ్ము, ధూళిని నిరంతరం తొలగిస్తూ, వీధి దీపాలు సక్రమంగా వెలిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇచ్చారు.

ప్రమాదాలు తరచుగా జరుగుతున్న ప్రాంతాలను ‘బ్లాక్ స్పాట్స్’గా గుర్తించి, అక్కడ అన్ని శాఖల అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ ప్రాంతాల్లో తక్షణ రక్షణ చర్యలు, అవసరమైన సదుపాయాల ఏర్పాటు ద్వారా ప్రమాదాల సంఖ్యను తగ్గించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

జిల్లాలో ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు ప్రత్యేక ‘ట్రామా కేర్ సెంటర్’ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారుల విశ్రాంతి కోసం కనీస సౌకర్యాలతో రెస్ట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆస్పత్రులకు తరలించి ప్రాణాలు కాపాడే ఉత్తమ పౌరులను ‘రహ్ వీర్లు’గా గుర్తించి, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వీరిని సత్కరించే కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం రూపొందించింది.

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ట్రాఫిక్ నిబంధనల అమలు, రాత్రి వేళ నిఘా, అక్రమంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ల తొలగింపు వంటి అంశాలపై సమావేశంలో దృష్టి సారించారు. ట్రాఫిక్ నియమాల అమలులో ఎలాంటి ఉపేక్ష ఉండదని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.