విద్యార్థినుల భద్రతకు డ్రోన్ల నిఘా:

ఆకతాయిలకు చెక్ పెట్టేందుకు అన్నమయ్య జిల్లా పోలీసులు

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల వద్ద విద్యార్థినుల భద్రతను ప్రధాన లక్ష్యంగా తీసుకుని జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసింది.

జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు విద్యాసంస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ముఖ్యంగా బాలికలు చదువుకునే పాఠశాలలు, కళాశాలలు ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడి స్కూల్ జోన్లపై ప్రత్యేక దృష్టి సారించారు.

జిల్లాలో పనిచేస్తున్న 'శక్తి' బృందాలు, బ్లూ కోల్ట్స్ సిబ్బంది సంయుక్తంగా ఈ డ్రోన్ల సాయంతో స్కూల్ జోన్లలో అడుగడుగునా డేగకన్ను వేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు రాకపోకలు సాగించే సమయాల్లో డ్రోన్ల ద్వారా ప్రత్యక్ష నిఘా నిర్వహిస్తున్నారు.

విద్యాసంస్థల సమీపంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా, అసభ్యకరంగా ప్రవర్తించినా డ్రోన్ విజువల్స్ ద్వారా వెంటనే గుర్తించి సంబంధిత వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోలీసు యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ చేస్తోంది. ఈ చర్యల ద్వారా విద్యార్థినులపై వేధింపులు, అసభ్య ప్రవర్తన, ఇతర అవాంఛనీయ ఘటనలను ముందస్తుగా అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది.

బాలికలు, మహిళల రక్షణ కోసం జిల్లా పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఎవరైనా వేధింపులకు గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 'శక్తి' టీమ్‌కు లేదా డయల్ 100/112కు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. అందిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకునేలా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచారు.

విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విద్యాసంస్థల వద్ద అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ల నిఘా నిరంతరాయంగా కొనసాగుతుందని జిల్లా పోలీసు యంత్రాంగం స్పష్టం చేస్తోంది. సాంకేతికతను వినియోగిస్తూ చేపడుతున్న ఈ చర్యలతో విద్యార్థినులు భయాందోళనలేమీ లేకుండా విద్యాభ్యాసం కొనసాగించే వాతావరణం ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు.