రాయలసీమ న్యూస్, అన్నమయ్య:
గనులు లాక్కున్న వైకాపా ప్రభుత్వం : మంత్రి రవీంద్ర ఆరోపణ
గత వైకాపా ప్రభుత్వ పాలనలో మైనింగ్ రంగంలో భారీ అక్రమాలు జరిగి, ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర గండిపడిందని రాష్ట్ర మైనింగ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మదనపల్లె మండలం నాయనివారిపల్లె సమీపంలోని ఒక క్వారీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ, వైకాపా అయిదేళ్ల పాలనలో క్వారీ యజమానులపై అక్రమ కేసులు నమోదు చేసి, వారిని వేధించడంతో పాటు ఆ పార్టీ నాయకులు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. క్వారీ యజమానులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి, చొక్కాలు విప్పించి సంతకాలు తీసుకుని గనులను లాక్కున్న విధానాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో జరిగిన ఈ దోపిడీ గురించి ప్రజలకు వివరించి, మూతపడిన క్వారీలను తిరిగి ప్రారంభించే చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. దీంతో మైనింగ్ రంగంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పారు. క్వారీల పునరుద్ధరణతో ఇప్పటివరకు సుమారు 40 శాతం మేర ఆదాయం పెరిగినట్లు ఆయన వివరించారు.
కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకుని క్వార్ట్జ్, ఐరన్‌ఓర్, లైమ్‌స్టోన్ వంటి ఖనిజాలను ఎగుమతి చేస్తున్నామని మంత్రి రవీంద్ర తెలిపారు. జిల్లాలో డోలమైట్, బైరైటీస్, క్వార్ట్జ్, లైమ్‌స్టోన్, ఐరన్‌ఓర్, కలర్ గ్రానైట్ వంటి విలువైన ఖనిజాలు విస్తారంగా ఉన్నట్లు గుర్తించినట్టు చెప్పారు. ఈ వనరులను పారదర్శకంగా వినియోగించి, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
గ్రానైట్ బ్లాకులను అనధికారికంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. అక్రమ రవాణా జరిగితే సంబంధితులపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మైనింగ్ రంగంలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, నిబంధనలు ఉల్లంఘించే వారిని ఎవరైనా ఉపేక్షించబోమని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, తెదేపా జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.













