రాయలసీమ న్యూస్, అన్నమయ్య: రాజంపేట పట్టణ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాల సహాయంతో తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
రాజంపేట ఎ.ఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే ఐ.పి.ఎస్. పర్యవేక్షణలో, రాజంపేట పట్టణ ఇన్స్పెక్టర్ B. నాగార్జున, ఎస్.ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని కీలక ప్రాంతాల్లో నిఘా కొనసాగింది. ఈ క్రమంలో రాజంపేట పట్టణ పరిధిలోని భువనగిరి పల్లె ‘Y’ జంక్షన్ సమీపంలో డ్రోన్ కెమెరా ద్వారా బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వారిని పోలీసులు గుర్తించారు.
డ్రోన్ కెమెరా ద్వారా లభించిన దృశ్యాల ఆధారంగా అక్కడ మద్యం సేవిస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి పై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలుగా పరిగణించి కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.
రాజంపేట పట్టణ సి.ఐ B. నాగార్జున అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు కఠిన వైఖరి అవలంబిస్తున్నారని స్పష్టం చేశారు. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం డ్రోన్ కెమెరాల సహాయంతో నిఘాను మరింత బలోపేతం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గుంపులుగా చేరి అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై ఎలాంటి రాయితీ ఉండదని ఆయన హెచ్చరించారు.
పట్టణంలో చట్టసమ్మతమైన శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలు కూడా సహకరించాలని, ఇలాంటి అసాంఘిక చర్యలు ఎక్కడైనా గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు.













