రాయచోటి: రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని హత్య చేసేందుకు పన్నిన కుట్ర బయటపడిన నేపథ్యంలో రాయచోటి పట్టణం శనివారం ఉద్రిక్తంగా మారింది. పట్టణంలోని మదనపల్లె రోడ్డులో ఉన్న ఓ హోటల్‌లో ఈ కుట్రకు సంబంధించిన చర్చలు, కదలికలు సాగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమై దాడి చేశారు.

హోటల్‌ వద్దకు చేరుకున్న పోలీసులు మారణాయుధాలు కలిగి ఉన్న అంతర్రాష్ట్ర రౌడీముఠాను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పురపాలక సంఘ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో వైకాపా నాయకులతో పాటు పంజాబ్‌కు చెందిన బౌన్సర్లు, రౌడీలు రాయచోటిలో మకాం వేసి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారం తెదేపా శ్రేణులకు అందింది. దీంతో వారు హోటల్‌ వద్దకు చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది.

ఈ ఘర్షణలో పరస్పర దాడులు జరిగి ఓ కారు ధ్వంసమైంది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కదలికలపై గత మూడు రోజులుగా ఈ ముఠా నిఘా పెట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన రౌడీలు, కర్నూలు ప్రాంతానికి చెందిన మరికొందరిని వైకాపా ఛైర్మన్‌ అభ్యర్థి జిన్నా షరీఫ్‌ రాయచోటికి తీసుకువచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడినట్లు సమాచారం. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్‌ ఆధ్వర్యంలో హోటల్‌పై దాడులు నిర్వహించిన పోలీసులు లైసెన్స్‌ లేని రెండు అత్యాధునిక పిస్టళ్లు, 30కి పైగా బుల్లెట్లు, గొడ్డళ్లు, ఇతర మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఘటనా స్థలంలో ఉన్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. వీరిలో రాయచోటికి చెందిన షేక్‌ మహమ్మద్‌ షరీఫ్‌ జిన్నా, షేక్‌ మహమ్మద్‌ కైఫ్, షైబ్‌ మహ్మద్‌ సైఫ్, షైబ్‌ మహమ్మద్‌ రఫీక్, కొండూరు జహీద్‌బాబు, షాయిబ్‌ మహమ్మద్‌ ఆరిఫ్, పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ జిల్లా నాధునగర్‌ ధంగు రోడ్డుకు చెందిన టార్టెమ్‌ సింగ్‌ (44), గురుదాస్‌పూర్‌ జిల్లా పిండిమాన్‌ గ్రామానికి చెందిన సరబ్‌జీత్‌ సింగ్‌, జలంధర్‌ జిల్లాకు చెందిన ప్రభుజీత్‌ సింగ్‌ (22), జలంధర్‌కు చెందిన అమితాజ్‌ (25), కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన రవికుమార్‌, అనిల్‌, సాధిక్‌ అలీ, ఉదయ్‌కుమార్‌, హనంతు మతుశాల పేర్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి రాయచోటిలో విలేకరుల సమావేశం నిర్వహించి స్పందించారు. దిల్లీ, హైదరాబాద్‌, పంజాబ్‌ తదితర ప్రాంతాల నుంచి కిరాయి ముఠాలను రప్పించి రాయచోటిలో భయాందోళనలు సృష్టించేందుకు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. గొడ్డలి పార్టీ అధినేత జగన్‌, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డితో పాటు అసలు సూత్రధారుల పాత్రపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.