రాయలసీమ న్యూస్, అన్నమయ్య: రాయచోటి: వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి పరిధిలో రాత్రివేళ పోలీసు నిఘాను మరింత పటిష్ఠం చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రతి రోజూ రాత్రి ప్రత్యేక నిఘా, గస్తీ కార్యక్రమాలు ముమ్మరం అవుతున్నాయి.
నేరాల నివారణ, రోడ్డు భద్రత బలోపేతం లక్ష్యంగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకునేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కూడా చేపడుతున్నారు. వాహనదారులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా ‘పేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
రాత్రి సమయంలో సంచరించే అనుమానితులపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు వారి వేలిముద్రలను సేకరిస్తున్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులు, ఏటీఎంలు, దేవాలయాలు, నివాస ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఒంటరి ప్రదేశాలు, చీకటి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అదనపు గస్తీ బృందాలను మోహరించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం కీలకమని పోలీసులు పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా వస్తువులు కనిపించిన వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 లేదా 112 నంబర్లకు ఫోన్ చేసి పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
జిల్లాలో నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు ఈ రాత్రి పహారా, ప్రత్యేక నిఘా కార్యక్రమాలు ఉపయోగపడతాయని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచనల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకే విధమైన నిఘా, తనిఖీ చర్యలు కొనసాగుతున్నాయి.
రాత్రివేళల్లో అవసరం లేకుండా బయటకు రావద్దని, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి మినహాయింపు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.













