రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్:
సిఎన్జీ vs ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు:
తక్కువ ఖర్చు, ఎక్కువ మైలేజ్ ?
పెట్రోల్ ధరలు నిరంతరం పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా కారుదారులు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా CNG కార్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో ఇథనాల్ ఆధారిత ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీతో నడిచే కార్లు కూడా మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సిఎన్జీ, ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లలో ఏది ఆర్థికంగా, వినియోగ పరంగా లాభదాయకమో అన్నదానిపై చర్చ మొదలైంది.
ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడంతో పాటు వినియోగదారులపై పడుతున్న ఇంధన భారం తగ్గించేందుకు భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగాన్ని విస్తృత స్థాయిలో పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీలో E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టడం ఈ దిశలో కీలక అడుగుగా భావిస్తున్నారు. అక్కడ E85 ధరను లీటరుకు రూ.82.12గా నిర్ణయించారు. ఇది ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న సాధారణ E20 పెట్రోల్ కంటే దాదాపు రూ.20 తక్కువ.
మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉండటం, దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్ వినియోగం పెరగడం వంటి కారణాలతో ఆటోమొబైల్ కంపెనీలు ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్ల తయారీపై దృష్టి సారిస్తున్నాయి. మారుతి సుజుకి ఇప్పటికే దేశంలో తొలి మాస్-మార్కెట్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు ‘Wagon R Flex-Fuel’ను పరిచయం చేసింది. దీంతో ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు కొనడం మంచిదా? CNG కార్లతో పోలిస్తే మైలేజ్, ఖర్చు పరంగా ఎలా ఉంటుందనే సందేహాలు వినియోగదారుల్లో కనిపిస్తున్నాయి.
మైలేజ్ పోలిక: సిఎన్జీకి ఆధిక్యం
గత కొన్నేళ్లుగా భారత మార్కెట్లో CNG కార్లకు మంచి ఆదరణ లభిస్తోంది. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే CNG ధర గణనీయంగా తక్కువ. ఫలితంగా కిలోమీటరుకు అయ్యే ప్రయాణ ఖర్చు కూడా తగ్గుతోంది. చాలా CNG కార్లు ఒక కిలోకు సుమారు 25 నుంచి 35 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తున్నాయి. అందుకే రోజూ ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులు, ట్యాక్సీ డ్రైవర్లు, తరచుగా లాంగ్ డ్రైవ్‌లు చేసే వారు CNG కార్లను మొదటి ఎంపికగా తీసుకుంటున్నారు.
ఇక ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు సాధారణ పెట్రోల్‌తో పాటు E85, E100 వంటి అధిక శాతం ఇథనాల్ కలిగిన ఇంధనాలతో కూడా నడుస్తాయి. ఇథనాల్ ధర పెట్రోల్ కంటే తక్కువే అయినా దాని శక్తి సాంద్రత తక్కువ. అంటే అదే దూరం ప్రయాణించేందుకు CNG లేదా సాధారణ పెట్రోల్ కారుతో పోలిస్తే ఫ్లెక్స్-ఫ్యూయల్ కారుకు కొంచెం ఎక్కువ ఇంధనం అవసరం. ఈ కారణంగా మైలేజ్ కొద్దిగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ధర, లభ్యత: ఎవరికీ ఏది సరైంది?
కార్ల ధరలను పరిశీలిస్తే ప్రస్తుతం CNG కార్లు మార్కెట్లో విస్తృతంగా లభ్యమవుతున్నాయి. అనేక కంపెనీలు, విభిన్న సెగ్మెంట్లలో CNG వేరియంట్లను అందిస్తున్నాయి. అయితే అదే మోడల్‌లో సాధారణ పెట్రోల్ వేరియంట్‌తో పోలిస్తే CNG వేరియంట్ ధర సుమారు రూ.80 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఎక్కువగా ఉంటుంది.
ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ మాత్రం భారత మార్కెట్లో ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అందువల్ల ఈ రకం కార్ల ఎంపికలు ప్రస్తుతం చాలా పరిమితంగా ఉన్నాయి. ఇటీవల ప్రదర్శించిన Maruti Wagon R Flex-Fuel కారు అంచనా ఎక్స్-షోరూమ్ ధరను సుమారు రూ.7.24 లక్షలుగా చెబుతున్నారు. ఇది అదే కారులో సాధారణ పెట్రోల్ మోడల్ కంటే దాదాపు రూ.85 వేల నుంచి రూ.86 వేల వరకు ఎక్కువ.
మొత్తం లెక్కలో ఎవరు ముందంజలో?
ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ప్రయాణ ఖర్చు, మైలేజ్ కోణంలో మాత్రమే చూస్తే CNG కార్లు వినియోగదారులకు ఎక్కువ లాభదాయకంగా కనిపిస్తున్నాయి. అయితే ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ ప్రధాన బలం దేశీయంగా తయారయ్యే ఇథనాల్ వినియోగాన్ని పెంచడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు, ఇంధన భద్రతకు తోడ్పడడంలో ఉంది.
మీ ప్రాంతంలో CNG బంకుల నెట్‌వర్క్ బాగుంటే, మీ వార్షిక ప్రయాణ దూరం ఎక్కువగా ఉంటే CNG కారు ఆర్థికంగా మంచి ఎంపికగా భావించవచ్చు. మరోవైపు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా E85 లభ్యత పెరిగి, ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్ల ధరలు తగ్గితే ఈ టెక్నాలజీ CNGకి గట్టి పోటీగా నిలిచే అవకాశం ఉన్నదని ఆటోమొబైల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.







