రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్: దసరా, సంక్రాంతి పండుగల ఆఫర్ల పేరుతో కొన్ని ఈ కామర్స్ సైట్లు వినియోగదారులను మోసగిస్తున్నాయన్న ఆరోపణలు సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా FLIPCART సహా కొన్ని ప్లాట్‌ఫారమ్‌లు తప్పుడు డిస్కౌంట్ ట్యాగ్‌లు పెట్టి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయంటూ నెటిజన్లు వీడియోలతో, స్క్రీన్‌షాట్‌లతో బయటపెడుతున్నారు.
ప్రైజ్ హిస్టరీ టూల్స్ ద్వారా పాత ధరలను పరిశీలిస్తే, ముందుగా ధరలను పెంచి తర్వాత తగ్గించినట్టు చూపిస్తూ ‘అతి తక్కువ ధర’, ‘బిగ్ డిస్కౌంట్’ అంటూ ప్రచారం చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అసలు అమ్మక ధరతో పోలిస్తే, ఆఫర్ పేరుతో చూపిస్తున్న తగ్గింపు వాస్తవానికి లేదని, కేవలం ట్యాగ్‌ల ద్వారా మాత్రమే ‘డిస్కౌంట్’ భావన కల్పిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
సంక్రాంతి సీజన్ ఆఫర్స్‌లో 11వేల 969 రూపాయలకి అమ్ముడైన ఒక వాచ్చు ప్రస్తుతం 18వేల 16 రూపాయలకి విక్రయిస్తూ, ఈ ఏడాది అతి తక్కువ ధర ఇదే అంటూ FLIPCART ఫేక్ ట్యాగ్ వేసిందని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ప్రైజ్ హిస్టరీ ద్వారా పాత ధరలతో పోల్చుతూ తయారు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆ వాచ్చు ధర గత నెలల్లో ఎంతగా మారిందో, ఆఫర్ ట్యాగ్‌లు ఎలా పెట్టారో వివరంగా చూపిస్తున్నారు.
డిస్కౌంట్ల పేరుతో సైట్లు మోసగిస్తున్నాయంటూ కస్టమర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజమైన తగ్గింపు లేకుండా, కేవలం మార్కెటింగ్ కోసం ‘ఫెస్టివల్ ఆఫర్’, ‘బిగ్ సేవింగ్స్’ వంటి ట్యాగ్‌లు పెట్టడం వినియోగదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని వారు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు. పండుగల సీజన్‌లో ప్రజలు ఎక్కువగా ఆన్‌లైన్ కొనుగోళ్లు చేసే సందర్భాన్ని ఈ కామర్స్ సైట్లు దుర్వినియోగం చేస్తున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రైజ్ హిస్టరీ వంటి టూల్స్ ద్వారా ధరల మార్పులను స్వయంగా పరిశీలించి, ఆఫర్ నిజమా కాదా అన్నది వినియోగదారులు ముందుగా తెలుసుకోవాలని నెటిజన్లు ఒకరికి ఒకరు సూచిస్తున్నారు. తప్పుడు డిస్కౌంట్ ట్యాగ్‌లపై సంబంధిత అధికార యంత్రాంగం దృష్టి సారించాలని, వినియోగదారుల హక్కులను కాపాడే సంస్థలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.






