వినియోగదారుల కోసం సరికొత్త ఆర్థిక సేవను ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి తెచ్చింది. ‘ఫ్లిప్‌కార్ట్ పే లేటర్’ పేరుతో ప్రారంభించిన ఈ సదుపాయం ద్వారా కస్టమర్లు తమకు నచ్చిన వస్తువులను వెంటనే కొనుగోలు చేసి, చెల్లింపును తర్వాత ఒకేసారి లేదా సులభమైన ఈఎంఐల రూపంలో చేయగలిగే అవకాశం కల్పించబడింది.

ఈ కొత్త సేవ కోసం ఫ్లిప్‌కార్ట్ సంస్థ PayU Finance తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సదుపాయం కేవలం Flipkart ప్లాట్‌ఫామ్‌లోనే కాకుండా, Myntra, Flipkart Minutes ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉండనుంది. కస్టమర్లందరూ ఈ కొత్త సేవను వినియోగించుకోవచ్చని సంస్థ తెలిపింది.

‘ఫ్లిప్‌కార్ట్ పే లేటర్’ ద్వారా వినియోగదారులు నిత్యవసర గృహోపకరణాల నుంచి ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎయిర్ కండిషనర్లు వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వరకు విభిన్న ఉత్పత్తులను సులభంగా కొనుగోలు చేయవచ్చు. కస్టమర్ల సౌకర్యార్థం చెల్లింపుల కోసం మూడు రకాల ఎంపికలను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.

మొదటి ఎంపిక ‘Pay Later’. ఈ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేసిన తేదీ నుంచి 30 రోజులలోపు ఎటువంటి అదనపు రుసుము లేకుండా బిల్లు చెల్లించవచ్చు. రెండో ఎంపిక ‘Pay in 3’. ఇందులో కొనుగోలు చేసిన మొత్తాన్ని మూడు సమాన వాయిదాలుగా విభజించి, నో-కాస్ట్ రూపంలో చెల్లించే అవకాశం ఉంటుంది. మూడో ఎంపిక ‘EMI’. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసినప్పుడు 3 నుంచి 12 నెలల వ్యవధితో సులభ వాయిదాల పద్ధతిని ఎంచుకోవచ్చు.

ఈ సదుపాయం తక్కువ ధర వస్తువుల నుండి అధిక ధర కలిగిన అన్ని రకాల కేటగిరీలకు వర్తిస్తుంది. ఫ్యాషన్, హోమ్, బ్యూటీ, గ్రాసరీ వంటి విభాగాల్లో కూడా ‘ఫ్లిప్‌కార్ట్ పే లేటర్’ సేవను వినియోగించుకోవచ్చు.

ఇదిలా ఉండగా, ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్టు 8 నుంచి ప్రతిష్టాత్మక ‘ఫ్రీడమ్ సేల్’ ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో SBI కార్డ్‌లపై 10 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్ లేదా డిస్కౌంట్ లభించనుంది. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నట్లు సంస్థ వెల్లడించింది.