రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్:
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఇరాన్‌పై అమెరికా దాడులు, ద్రవ్యోల్బణ భయాలతో ఈ లోహాలకు గిరాకీ ఏర్పడింది. దీంతో వీటి ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ విపణిలో బుధవారం ఉదయం 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,49,400కు చేరింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు రూ.2వేలు పెరగింది. ఇక, కేజీ వెండి ధర రూ.2.32లక్షలు పలికింది.
మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో బంగారం ఆగస్టు ఫ్యూచర్స్ ధర 1.06శాతం పెరిగి రూ.1.44లక్షలుగా కొనసాగుతోంది. వెండి సెప్టెంబరు ఫ్యూచర్స్ ధర కూడా ఒక శాతం పెరిగి రూ.2.26లక్షలుగా కొనసాగుతోంది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు పుత్తడి ధర 4,129 డాలర్లు పలికింది. ఔన్సు వెండి ధర 60 డాలర్లు వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇరాన్‌తో ఇప్పట్లో చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మరోవైపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఫలితంగా ద్రవ్యోల్బణ భయాలు నెలకొన్నాయి. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో బంగారం, వెండిలో పెట్టుబడులు శ్రేయస్కరమని మదుపర్లు భావిస్తున్నారు. దీంతో వీటికి డిమాండ్ ఏర్పడింది.







